Ayodhya: రామాలయ ప్రారంభోత్సవానికి లక్ష లడ్డూలు సిద్ధం చేస్తున్న టీటీడీ సిబ్బంది
X
అయోధ్యలో ఈ నెల 22న రామమందిర ప్రాణ ప్రతిష్ఠ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. అయోధ్య రామాలయం ప్రారంభోత్సవంలో పాల్గొనే భక్తులకు టీటీడీ తీపి కబురు చెప్పింది. శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపనను తిలకించేందుకు వచ్చే భక్తులకు శ్రీవారి లడ్డూలను ప్రసాదంగా అందజేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. అయోధ్యలోని రామమందిరంలో జరిగే ప్రాణప్రతిష్ట వేడుకకు హాజరయ్యే భక్తులకు లక్ష తిరుమల వెంకన్న ప్రసాదం పంపాలని టీటీడీ నిర్ణయించింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి సిబ్బంది లడ్డూలను సిద్దం చేస్తోంది. లక్ష లడ్డులను అయోధ్యకు పంపించే కార్యక్రమంలో భాగంగా సిబ్బంది లడ్డూల తయారీలో తలమునకలవుతుంది. వీలైనంత త్వరగా లడ్డూలను అయోధ్యకు పంపాలని భావిస్తోంది.
అయోధ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా తయారుచేయించిన లక్ష లడ్డూలను అయోధ్యకు పంపుతున్నట్టు ఇప్పటికే ఆలయ ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించారు. ఈ ఒక్కో లడ్డూ 25 గ్రాములు ఉంటుందని వెల్లడించిన సంగతి తెలిసిందే. సాధారణంగా తిరుమలలో భక్తులకు విక్రయించే లడ్డూలు 75 గ్రాములు ఉండగా..అయోధ్య కోసం 25 గ్రాముల ఉండే లక్ష లడ్డూలను శ్రీవారి ప్రసాదంగా అందిచనున్నట్టు వెల్లడించారు. సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు తిరుమలలో దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు, ధార్మిక సంస్థలతో సదస్సు నిర్వహించనున్నట్లు ఈవో ఏవీ ధర్మారెడ్డి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి టీటీడీ సిబ్బంది ఏర్పాట్లు చేస్తోంది. లడ్డూలను సమయానికి అందించాలనే ఉద్దేశంతో టీటీడీ సిబ్బందిని రంగంలోకి దించి లడ్డూలను తయారు చేసేపనిలో నిమగ్నమైంది