Home > ఆంధ్రప్రదేశ్ > కుక్క కరిచిందని ఇంట్లో చెప్పని యువకుడు.. రేబిస్ సోకి మృతి

కుక్క కరిచిందని ఇంట్లో చెప్పని యువకుడు.. రేబిస్ సోకి మృతి

కుక్క కరిచిందని ఇంట్లో చెప్పని యువకుడు.. రేబిస్ సోకి మృతి
X

కుక్క కాటుకు చికిత్స తీసుకోకపోవడంతో రేబిస్ బారిన పడి ఓ యువకుడు మృత్యువాతపడ్డాడు. ఈ ఘటన కాకినాడలో జరిగింది. కుక్క కరిచిందన్న విషయం ఇంట్లో చెప్పకుండా నిర్లక్ష్యం వహించడంతో ఈ దారుణం జరిగింది. గొల్లప్రోలుకు చెందిన తేలు ఓంసాయిని ఆరు నెలల క్రితం ఓ వీధి కుక్క కరిచింది. అయితే భయంతో ఆ విషయం ఇంట్లో చెప్పలేదు. 3 రోజుల క్రితం జ్వరం బారిన పడిన బాధితుడు.. మంచినీళ్లు తాగలేకపోవడం, నీటిని చూసి భయపడుతుండటంతో కుటుంబసభ్యులు శనివారం కాకినాడ జీజీహెచ్‌లో చేర్చారు. రేబిస్ సోకినట్లు గుర్తించిన డాక్టర్లు ట్రీట్ మెంట్ ఇచ్చినా వ్యాధి ముదరడంతో ఆదివారం మృతి చెందాడు. ఆరేళ్ల క్రితం కూడా తమ కుమారుడ్ని కుక్క కరిచిందని, అప్పుడు వైద్యం చేయించామని తల్లిదండ్రులు వాపోయారు. చేతికందొచ్చిన కొడుకు కుక్క కాటుతో మృతి చెందడంతో వారి దుఖం ఆపడం ఎవరితరం కాలేదు.

కుక్క కాటుకు గురైనవారు నిర్లక్ష్యం వహించకుండా వెంటనే చికిత్స చేయించుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు. కుక్క కరిచిన రోజున యాంటీ రేబిస్‌ వ్యాక్సిన్‌తో పాటు టీటీ ఇంజక్షన్‌ చేయించుకోవాలని, ఆ తర్వాత 3వ రోజు, 7వ రోజు, 28వ రోజున వ్యాక్సిన్‌ తీసుకోవాలని అంటున్నారు. ఇలా చేయడం వల్ల రేబీస్‌ ముప్పు తప్పుతుందని చెబుతున్నారు. చికిత్స సమయంలో కరిచిన కుక్కను గమనిస్తూ ఉండాలని ఒకవేళ అది వెంటనే చనిపోతే పిచ్చికుక్కగా భావించి మరింత మెరుగైన వైద్యం అందించాల్సి ఉంటుందని అంటున్నారు.

Updated : 24 July 2023 8:13 AM IST
Tags:    
Next Story
Share it
Top