Home > ఆంధ్రప్రదేశ్ > రెండు కిలోల పులస.. ఎంత రేటో తెలుసా

రెండు కిలోల పులస.. ఎంత రేటో తెలుసా

రెండు కిలోల పులస.. ఎంత రేటో తెలుసా
X

గోదావరి నదికి ఎదురీదుతూ వెళ్లే పులస చేపల రుచి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వాటి రుచిని ఒకసారి రుచి చూసిన వారు జీవితంలో మర్చిపోలేరు. అందుకే వాటికి అంత గిరాకీ. అంతేకాదు, పుస్తెలు అమ్మి అయినా పులస తినాలని చెబుతారు. జాలర్ల వలలో ఒక్క చేప పడినా వారి పంట పండుతుంది. సముద్రంలో ఉన్నప్పుడు వీటిని ఇలసగా పిలుస్తే గోదావరి నదిలోకి వచ్చాకే పులసగా పిలుస్తారు. గోదావరిలోని తీపి నీరు, సముద్రంలోని ఉప్పునీరు కలవడం వల్ల ఈ చేపలకు ప్రత్యేక రుచి వస్తుందట. ఇలాంటి రుచిని పంచే చేపలను కొనుగోలు చేసేందుకు వందలాదిమంది క్యూకడుతుంటారు. ఏ ఒక్కరికో దానిని అమ్మలేక వేలం పాటలు నిర్వహిస్తుంటారు.





తాజాగా పుదుచ్చేరి యానాంలో రెండు కిలోల పులస చేప 16 వేల రూపాయలు పలికింది. యానాం మార్కెట్‌లో మత్స్యకార మహిళ రత్నం అమ్మకానికి పెట్టడంతో కొనేందుకు పులస ప్రియులు ఎగబడ్డారు. వాస్తవానికి గోదావరిలో పులస చేప రాక ఈ ఏడాది బాగా తగ్గిపోయింది. నకిలీ పులస చేపల విక్రయం పెరిగింది. పులస చేప ధర ఎక్కువగా ఉండటంతో బాగా డబ్బులు ఉన్న ఆసాములకే తప్ప సామాన్యులకు అందని ద్రాక్షగానే మిగిలింది.





వర్షాకాలం ప్రారంభమైన సమయంలో ఈ పులస చేపలు మార్కెట్‌లో కనిపిస్తుంటాయి. అంతేకాదు ఈ పులస చేపలు ఎక్కువగా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల పరిధిలో ఉన్న అంతర్వేది, భైరవపాలెం, నరసాపురంలో ఎక్కువగా కనిపిస్తాయి. గోదావరి జలాలు సముద్రంలో కలిసే ఈ రెండు పాయల దగ్గరే పులసలు లభ్యం అవుతాయని స్థానికులు చెబుతున్నారు.




Updated : 23 Aug 2023 6:07 AM GMT
Tags:    
Next Story
Share it
Top