భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. దర్శనానికి ఎంత సమయం పడుతుందంటే..
X
తిరుమల కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. ఆదివారం కావడంతో దర్శనం కోసం జనం భారీగా తరలివచ్చారు. శ్రీవారి సర్వదర్శనం కోసం 31 కంపార్ట్మెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. కంపార్ట్మెంట్లు నిండిపోవడంతో క్యూలైన్లు బయట వరకు వచ్చాయి. స్వామి వారి దర్శనం కోసం దాదాపు 24 గంటల సమయం పడుతోంది. ఈ క్రమంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
శ్రీవారి ఆలయంతో పాటు లడ్డూ కేంద్రాలు, అఖిలాండం, అన్నప్రసాద భవనం, బస్టాండ్, గదుల కేటాయింపు కేంద్రాలు, కళ్యాణ కట్టలు యాత్రికులతో నిండిపోయాయి. ఇదిలా ఉంటే అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల ద్వారా భక్తులు భారీ సంఖ్యలో కాలినడకన తిరుమలకు వస్తున్నారు. అలిపిరి కౌంటర్ వద్ద లగేజీని భద్రపరిచేందుకే దాదాపు 2గంటలకుపైగా సమయం పడుతోంది. అలిపిరి వద్ద రద్దీ భారీగా పెరగడంతో రుయా హాస్పిటల్ నుంచి అలిపిరి సర్కిల్ వరకు ట్రాఫిక్ స్తంభించింది.
శనివారం శ్రీవారిని 87,171 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. స్వామి వారికి హుండీ ఆదాయం రూ. 3.68 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. 38,273 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించినట్లు చెప్పారు.