నారాయణ మెడికల్ కాలేజ్‌లో మెడికో చైతన్య సూసైడ్
X
నెల్లూరు జిల్లాలోని నారాయణ మెడికల్ కాలేజ్‌లో వైద్య విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది. చైత్యన అనే మెడికో ఆదివారం క్యాంపస్ హాస్టల్ గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. శ్రీకాకుళం జిల్లా పలాసకు చెందిన చైతన్య(23) అనే వైద్య విద్యార్థిని నెల్లూరు నగర పరిధిలోని చింతారెడ్డిపాలెం వద్ద ఉన్న నారాయణ మెడికల్ కళాశాల హాస్టల్‌లో ఉంటూ హౌస్ సర్జన్ చేస్తోంది. ఈ రోజు ఉదయం కళాశాల హాస్టల్ గదిలో చైతన్య బలవన్మరణానికి పాల్పడింది. ఆమెకు రెండు నెలల క్రితమే వివాహం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టానికి తరలించారు. కుటుంబ కలహాల వల్లే చైతన్య ఆత్మహత్యకు పాల్పడినట్లు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో ఈ మధ్య ఐఐటీ, మెడికల్ విద్యార్థుల వరుస ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. వారం రోజుల క్రితం కర్నూలు జిల్లాలో కూడా ఓ మెడికో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెంచికలపాడు విశ్వభారతి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ థర్డ్ ఇయర్ చదువుతున్న లోకేష్ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నాడు. నెల్లూరు జిల్లా కావలికి చెందిన లోకేశ్ ప్రేమ విఫలమై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంతకుముందు బాసర ట్రిపుల్ ఐటీలో రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆ తర్వాత కొన్ని రోజులకే వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో మరో విద్యార్థిని నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నం చేసింది.