ఏపీలో కొత్త రాజకీయ పార్టీ..!
X
ఏపీలో మరో కొత్త పార్టీ ఆవిర్భవించనుంది. ప్రముఖ వ్యాపార వేత్త రామచంద్రయాదవ్ కొత్త పార్టీని పెట్టబోతున్నట్లు ప్రకటించారు. జులై 23న కొత్త రాజకీయ పార్టీతో ప్రజలు ముందుకు వస్తున్నట్లు తెలిపారు. ఆదే రోజు గుంటూరు-విజయవాడ మధ్య నాగార్జున యూనివర్సిటీ ముందు ప్రజా సింహగర్జన పేరిట పార్టీ ఆవిర్భావ సభ నిర్వహించనున్నట్టు వివరించారు.
ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం దోపిడీ జరుగుతుందని..దానికి కక్కించడమే లక్ష్యంగా పార్టీ పెడుతున్నట్లు రామచంద్రయాదవ్ తెలిపారు. భూములు, మైనింగ్, ఇసుక పేరుతో అధికార పార్టీ నేతలు రూ.వేల కోట్లు దోపిడీ చేస్తున్నారని మండిపడ్డారు. తన రాజకీయ పార్టీ నవశకానికి నాంది పలుకుతుందన్నారు. ఒక ఫ్యాక్షన్ నాయకుడు సీఎంగా ఉండడం ఏపీ ప్రజల దురదృష్టకరమని.. రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ది చెందాలంటే రాజకీయ మార్పు రావాలని పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంకు రాజకీయాలకు వినియోగిస్తూ అణచి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా తీసుకురావడంలో విఫలమయ్యారు అని రామచంద్రయాదవ్ విమర్శించారు.