ఆత్రేయపురం పూతరేకులకు..అరుదైన గుర్తింపు
X
ఆత్రేయపురం పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేవి పూతరేకులు. ఈ గ్రామం పూతరేకుల తయారీతో గోదావరి జిల్లాల్లోనే బాగా ఫేమస్ అయ్యింది. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే ఈ స్వీటును రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న భోజన ప్రియులు అమితంగా ఇష్టపడతారు. ఎన్నో ఏళ్ల చరిత్ర ఉన్న ఈ పేపర్ స్వీట్‌కు ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. ఆత్రేయపురం పూతరేకులకు భౌగోళిక గుర్తింపు లభించింది. జీఐ గుర్తింపుతో ఆత్రేయపురం కీర్తి ఇప్పుడు జాతీయ స్థాయికి చేరుకుంది. తరతరాలుగా వారసత్వంగా వస్తున్న పూతరేకుల తయారీపై ఈ ఊరికే పూర్తి స్థాయి గుర్తింపు లభించడంతో పాటు , హక్కులు ఉంటాయని తేలింది.
జియోగ్రాఫికల్ ఐడెంటిటీ కోసం కొంత కాలం క్రితం డా.బి.ఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురానికి చెందిన సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖకు అప్లై చేసింది. సానుకూలంగా స్పందించిన కేంద్రం ఫిబ్రవరి 13వ తేదీన ఆత్రేయపురం పూతరేకుల గుర్తింపుపై జీఐ జర్నల్‌లో ప్రకటన ఇచ్చింది. ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలని సూచించింది. అయితే అభ్యంతరాల స్వీకరణ జూన్ 13వ తేదీతో ముగిసింది. అయినా ఇప్పటి వరకు ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో భౌగోళిక గుర్తింపు ఖాయమని సర్ ఆర్థర్ కాటన్ పూతరేకుల సహకార సంఘం భావిస్తోంది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఒక్కో ఊరుకు ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఆయా ప్రాంతాల్లో తయారు చేసే వంటకాలు, ఉత్పత్తులతో ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంటున్నాయి పలు గ్రామాలు. ఇప్పటికే బందరులో తయారు చేసే లడ్డు, తిరుపతి లడ్డు, ఉప్పాడ జాంధానీ, ఏటికొప్పాక కొయ్య బొమ్మలు, బొబ్బిలి వీణ, బంగినపల్లి మామిడి, అరకు కాఫీ, ధర్మవరం చీర..ఇలా ఒక్కో ప్రదేశానికి జియోగ్రాఫికల్ ఐడెంటిటీ లభించింది. ఎంతో విశిష్టత,చరిత్ర కలిగి, గ్రామ భాగస్వామ్యం ఉంటే తప్ప ఆ గ్రామానికి ఆయా పదార్థాలకు జీఐ గుర్తింపు సాధ్యం కాదు. అలాంటి లిస్టులో ఇప్పుడు ఆత్రేయపురం పూతరేకు చేరుకుంది. ఈ గ్రామంలోని మహిళలను సగర్వంగా జాతీయ స్థాయిలో తలెత్తుకునేలా చేసింది.