Home > ఆంధ్రప్రదేశ్ > చంద్రబాబుకు మరో దెబ్బ.. ఇంటికి కాదు రాజమండ్రి జైలుకే..

చంద్రబాబుకు మరో దెబ్బ.. ఇంటికి కాదు రాజమండ్రి జైలుకే..

చంద్రబాబుకు మరో దెబ్బ.. ఇంటికి కాదు రాజమండ్రి జైలుకే..
X

స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో అరెస్టయిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఏసీబీ కోర్టులో మరో దెబ్బ తగిలింది. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్‌ను హౌస్ అరెస్ట్(గృహనిర్బంధం)గా మార్చాలని ఆయన న్యాయవాదులు వేసిన పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చింది. ఆదివారం పొద్దుపోయాక దరఖాస్తుపై నిర్ణయం వెలువరించింది. చంద్రబాబు వయసును, అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని హౌస్ అరెస్ట్ చేయాలని ఆయన న్యాయవాదులు కోరారు. అయితే కోర్టుకు అందుకు నిరాకరిస్తూ ఆయనకు ఏ ఇబ్బందీ లేకుండా చూసుకోవాలని జైలు అధికారులను ఆదేశించింది.

చంద్రబాబుకు రాజమండ్రి జైలులో ప్రత్యేక గది, వసతులు ఏర్పాటు చేయడంతోపాటు వైద్య చికిత్స, ఔషధాలు అందించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ఇంటి నుంచి ప్రత్యేక ఆహారం తీసుకువచ్చేందుకూ అనుమతివ్వాలని చెప్పింది. దీంతో పోలీసులు బాబును ఆయన సొంత కాన్వాయ్‌లోనే విజయవాడ నుంచి రాజమండ్రి జైలుకు తీసుకెళ్తున్నారు. పన్నెండు గంటలు దాకా రాజమండ్రి చేరుకునే అవకాశముంది. మరోపక్క రేపు(సోమవారం) టీడీపీ రాష్ట్రవ్యాప్త బంద్‌కు పిలుపునిచ్చింది. అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. బాబుకు మద్దతుగా బంద్‌లో పాల్గొని శాంతియుతంగా నిరసన చేపట్టాలని జనసేన నేత పవన్ కల్యాణ్ తన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.


Updated : 10 Sept 2023 10:38 PM IST
Tags:    
Next Story
Share it
Top