Breaking News : చంద్రబాబుకు రిమాండ్.. రాజమండ్రి సెంట్రల్ జైలుకు..
X
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు విజయవాడ ఏసీబీ కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 22వరకు కోర్టు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. బాబును రాజమండ్రి జైలుకు తరలించాలని న్యాయమూర్తి తీర్పునిచ్చారు. అంతకుముందు చంద్రబాబు అరెస్ట్‌పై ఏసీబీ కోర్టులో సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది సిద్ధార్థ లూథ్రా, సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఉదయం 8 గంటలకు తర్వాత ప్రారంభమైన వాదనలు.. మధ్యాహ్నం 2.30 గంటల వరకు కొనసాగాయి.
కాగా మొదట రూపొందించిన ఎఫ్ఐఆర్లో చంద్రబాబును ఏ-1గా చేర్చి.. తాజాగా కోర్టులో ప్రవేశపెట్టే టైంలో ఏ-37గా సిట్ పేర్కొంది. ఏ-1గా గంటా సుబ్బారావు పేరును చేర్చారు. నిధుల మళ్లింపుపై అప్పటి ఫైనాన్స్ సెక్రటరీ అభ్యంతరం చెప్పినా చంద్రబాబు పట్టించుకోలేదని సీఐడీ తెలిపింది. తాడేపల్లిలోని స్కిల్ డెవలప్మెంట్ కేంద్రంగా అక్రమాలు జరిగాయని, దీనికి సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం ప్రభుత్వ వాటాగా రూ.371 కోట్లు చెల్లించారని.. ఇందులో రూ.271 కోట్లను షెల్ కంపెనీలకు దారి మళ్లించినట్లు సీఐడీ అభియోగాలు మోపింది.సీఐడీ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం బాబుకు రిమాండ్ విధించింది.