Actor Suman : టీడీపీ - జనసేన కూటమి.. సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు
X
ఏపీలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతోన్నాయి. మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనుండడంతో పార్టీలన్నీ స్పీడ్ పెంచాయి. ఈ ఎన్నికల్లో వైసీపీ ఒంటరిగా బరిలోకి దిగుతుండగా.. టీడీపీ-జనసేన కలిసి పోటీచేస్తున్నాయి. ఇప్పటికే జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ.. టీడీపీతో జతకడుతుందా లేదా అన్నది తేలాల్సివుంది. ఈ క్రమంలో సీనియర్ నటుడు సుమన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు తనకు రాజకీయ గురువు అని చెప్పారు.
చంద్రబాబు గతంలో తనకు బాపట్ల ఎంపీగా పోటీ చేసే అవకాశం ఇచ్చారని.. కానీ ఎన్నికలకు దూరంగా ఉన్నట్లు సుమన్ చెప్పారు. తనపై నమ్మకంతో టికెట్ ఆఫర్ చేసిన బాబుకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఇక టీడీపీ-జనసేన సీట్ల సర్దుబాటు సక్రమంగా జరిగితే.. కూటమి విజయం ఖాయమని సుమన్ అన్నారు. అప్పుడు టీడీపీ-జనసేన కూటమి విజయాన్ని ఎవరూ ఆపలేరని చెప్పారు. చంద్రబాబుకు పాలనలో మంచి అనుభవం ఉందని వ్యాఖ్యానించారు. ఓటర్లు ప్రలోభాలకు లోనవకుండా ఆలోచించి ఓటెయ్యాలని సూచించారు.