Home > ఆంధ్రప్రదేశ్ > బీజేపీలో చేరినా.. క్రైస్తవులకు అండగా ఉంటా

బీజేపీలో చేరినా.. క్రైస్తవులకు అండగా ఉంటా

బీజేపీలో చేరినా.. క్రైస్తవులకు అండగా ఉంటా
X

తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడం కోసం రాష్ట్ర బీజేపీ నాయకులు వ్యూహాలు రచిస్తున్నారు. పలు కీలక నేతలకు ఆఫర్లిస్తూ.. పార్టీలోకి ఆహ్వానించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ (ఆగస్టు 2) సినీనటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరారు. ఢిల్లీలోని బీజేపీ హెడ్క్వార్టర్స్లో రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, డీకే అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన జయసుధ.. ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వం నచ్చడం వల్లే బీజేపీలో చేరినట్లు తెలిపారు. ప్రధాని నాయకత్వంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని అన్నారు. తాను బీజేపీలో చేరినా.. క్రైస్తవులకు అండగా ఉంటానని స్పష్టం చేశారు.

రాజకీయ ప్రస్థానం:

జయసుధ తన రాజకీయ ప్రస్థానాన్ని 2009 నుంచి మొదలుపెట్టారు. 2009లో కాంగ్రెస్ నుంచి సికింద్రాబాద్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు బై చెప్పి.. టీడీపీ కండువా కప్పుకున్నారు. గత ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి వైసీపీలోకి మారారు. కొంత కాలంగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె.. కిరణ్ కుమార్ రెడ్డి, కిషన్ రెడ్డిలతో చర్చలు జరిపి ప్రస్తుతం బీజేపీ గూటికి చేరారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే టికెట్ సికింద్రాబాద్ నుంచి కాకుండా ముషీరాబాద్ నుంచి ఆశిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. వీటిపై స్పందించిన జయసుధ.. ఆ ప్రచారంలో వాస్తవం లేదని, ఎక్కడి నుంచి పోటీ చేస్తాననే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు.

Updated : 2 Aug 2023 6:17 PM IST
Tags:    
Next Story
Share it
Top