Ambati Rambabu : ఏపీ రాజధానిపై అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు
X
ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంపై మంత్రి అంబటి రాంబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి ఏపీ రాజధాని అమరావతి మాత్రమేనని అన్నారు. తమ ప్రభుత్వం మూడు రాజధానులను ప్రకటించిందని, అయితే దానికి సంబంధించి న్యాయస్థానాల్లో కేసులు ఉండటం వల్ల ఇప్పటి వరకూ ఏపీ రాజధాని అమరావతిగా మాత్రమే పరిగణిస్తున్నట్లు వెల్లడించారు.
కొన్ని న్యాయపరమైన చిక్కులు తొలగిపోయిన వెంటనే మూడు రాజధానుల నిర్మాణాన్ని చేపడతామని అంబటి రాంబాబు తెలిపారు. ప్రభుత్వం ఎంత ప్రయత్నించినప్పటికీ న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయన్నారు. అందుకే మూడు రాజధానులు సాధ్యం కాలేదన్నారు. ఆ ఇబ్బందులు త్వరలోనే తొలగిపోతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
మరోవైపు టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై కూడా అంబటి రాంబాబు మాట్లాడారు. జనసేన పార్టీ టీడీపీతో ఉన్నట్లా? లేక బీజేపీతో ఉన్నట్లా? అనేతి ఇంత వరకూ ఎవ్వరూ చెప్పడం లేదని, కానీ రెండు పార్టీలతోనూ సన్నిహితంగానే ఉందని అంబటి అన్నారు. అన్ని పార్టీలు పొత్తుగా ఒక్కటై వచ్చినా కూడా ఎన్నికల్లో వైసీపీనే విజయం సాధిస్తుందన్నారు. సీఎం జగన్ సర్కారే ఏపీలో మళ్లీ ఏర్పాటవుతుందన్నారు.