Ambati Rambabu : లోకేష్‌ను దాచారు.. టీడీపీ కథ కంచికే: అంబటి రాంబాబు
X
టీడీపీ హయాంలో ప్రజలకు ఇచ్చిన ఏ వాగ్దానాలను చంద్రబాబు అమలు చేయలేదని, ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్ ప్రతి హామీ అమలు చేశారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. బాబు, జగన్ మధ్య చాలా తేడా ఉందన్నారు. 2014లో బాబు ఇచ్చిన మేనిఫెస్టో మాయం అయ్యిందని, తమ ప్రభుత్వం మేనిఫెస్టోలోని ప్రతి హామీని అమలు చేస్తోందని తెలిపారు. ప్రతి ఇంట్లో వైసీపీ పథకాలు అమలు అవుతున్నాయని, అందుకే ధైర్యంగా తమ నాయకులు ఓటు అడగటానికి వెళ్తున్నారని అన్నారు.
ఎన్నికల్లో 175 సీట్లు గెలిచి చరిత్ర సృష్టిస్తామని, అధికారంలోకి మళ్లీ వచ్చి తామేంటో నిరూపిస్తామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం మేనిఫెస్టోని అమలు చేయడం లేదంటూ కొందరు ఆరోపణలు చేస్తున్నారని, టీడీపీకి దమ్ముంటే 2014 మేనిఫెస్టోను తీసుకొచ్చి మాట్లాడాలని, ఆ దమ్ము వైసీపీ నేతలకు మాత్రమే ఉందన్నారు. చంద్రబాబు మాట విని పవన్ కళ్యాణ్ తమ కార్యకర్తల్ని ముంచుతున్నాడని, చంద్రబాబు ముష్టి వేస్తే దాన్ని తీసుకునే పరిస్థితి తప్పా వేరే గత్యంతరం లేదని అంబటి షాకింగ్ కామెంట్స్ చేశారు.
చంద్రబాబు చుట్టూ పవన్ రోజూ తిరగడమే తప్పా ఫలితం ఏమీ ఉండదన్నారు. జనసేనకు బాబు 20 నుంచి 25 సీట్లు ఇవ్వడమే గగనంగా మారిందన్నారు. ఇప్పటికైనా జనసేన కార్యకర్తలు ఆలోచించుకోవాలని, బాబు మాయలో పడి మోసపోవద్దని తెలిపారు. ఆశ్చర్యకరంగా ఈ మధ్య నారా లోకేష్ బయటకు రావడం లేదని, ఆయన్ని టీడీపీ నేతలు కావాలనే దాచి పెట్టి ఉంటారని అన్నారు. ఒక వేళ లోకేష్ బయటకు వస్తే టీడీపీ ఓడిపోవడం ఖాయమని తెలుసుకుని లోకేష్‌ను బయటకు రాకుండా దాచిపెట్టారని అంబటి రాంబాబు అన్నారు. పొత్తులు పెట్టుకున్నా, కూటమిగా వచ్చినా ప్రజలు వారిని పక్కనపెడతారని, వైసీపీనే గెలిపిస్తారని మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు.