మంత్రాలయంలో 108 అడుగుల శ్రీరాముడి విగ్రహానికి అమిత్ షా శంకుస్థాపన
X
ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు జిల్లా మంత్రాలయంలో ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 108 అడుగుల శ్రీరాముని పంచలోహ విగ్రహానికి కేంద్ర హోంమంత్రి అమిత్‌షా శంకుస్థాపన చేశారు. దాదాపు రూ.300 కోట్లతో నిర్మించనున్న శ్రీరాముడి విగ్రహానికి అమిత్ షా శంకుస్థాపన చేశారు. శ్రీరాముడి విగ్రహం ఏర్పాటుతో ప్రపంచ ఆధ్యాత్మిక, పర్యటక కేంద్రంగా మంత్రాలయం విరాజిల్లుతుందని అమిత్ షా ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వర్చువల్‌గా పాల్గొనడం తన పూర్వ జన్మ సుకృతమన్నారు.
జైశ్రీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో శ్రీరాముని పంచలోహ విగ్రహ నిర్మాణం జరగనుంది. మంత్రాలయం శ్రీమఠానికి సుమారు కిలోమీటరు దూరంలో పదెకరాల సువిశాల స్థలంలో ఆలయ నిర్మాణం జరగనుంది. గుజరాత్‌లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ భారీ విగ్రహాన్ని రూపొందించిన శిల్పి రామ్ వాంజీ సుతార్‌కు శ్రీరాముని విగ్రహ రూపకల్పన బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే విగ్రహ నమూనాను ఆయన ప్రాథమికంగా ఖరారు చేశారు. ఈ విగ్రహ నిర్మాణానికి సుమారు రెండేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
శ్రీరాముని విగ్రహానికి ముందు రామాలయం నిర్మిస్తారు. పూర్తిస్తాయి రాతి కట్టడంలా ఈ రామాలయాన్ని తీర్చిదిద్దనున్నారు. ఈ పదెకరాల్లోనే తిరుమల వెంకటేశ్వరస్వామి, కాశీలోని విశ్వనాథ ఆలయం, సింహాచలంలోని నరసింహస్వామి దేవాలయం, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్ ఆలయం, కేరళ అనంత పద్మనాభస్వామి దేవాలయం, బాసర జ్ఞాన సరస్వతి ఆలయం, కర్ణాటక చెలువ నారాయణస్వామి ఆలయం, తమిళనాడు మూషణం వరాహస్వామి ఆలయం, మహారాష్ట్రలోని విఠోభా రుక్మిణి ఆలయాలను తలపించే చిన్నపాటి ఆలయాలనూ నిర్మిస్తారు.