నదిలో బయటపడ్డ పురాతన దేవతా విగ్రహలు.. తరలివస్తున్న జనం
X
తవ్వకాల్లో, నదుల్లో విగ్రహాలు బయటపడ్డాయనే వార్త బయటకొస్తే చాలు.. వెంటనే వైరల్ అవుతాయి. స్థానిక ప్రజలు కూడా అద్భుతం జరిగినట్లు ఆ ప్రాంతంలో గుమిగూడతారు. ఏపీలో పల్నాడు జిల్లాలో ఇలాంటి సంఘటనే చోటుచేసుకుంది. అచ్చంపేట సమీపంలోని అంబడిపూడి దగ్గర కృష్ణా నదిలో పురాతన విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకొచ్చాయి. నది ఒడ్డులో విష్ణుమూర్తి, శివలింగంతో పాటుగా రెండు నందుల రాతి విగ్రహాలు ఉన్నాయి. కృష్ణానది ఎగువ భాగం నుంచి ఈ విగ్రహాలు కొట్టుకుని వచ్చాయా.. లేదంటే ఇసుక తవ్వకాల వల్ల నది అడుగున ఉన్న విగ్రహాలు బయటపడ్డాయా అనేది ఇంకా తెలియరాలేదు.
స్థానికులు ఈ విగ్రహాలను రక్షిత మంచినీటి పథకం కాలువ దగ్గరకు చేర్చారు.. ఈ విషయం తెలియడంతో విగ్రహాలను చూసేందుకు జనాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ఈ విగ్రహాల విషయాన్ని స్థానికులు అధికారులకు సమాచారం అందించగా.. వారు విగ్రహాలను పరిశీలించారు. అధికారులు పురావస్తు శాఖ అధికారులకు విషయాన్ని చెప్పారు. వారి పరిశీలించి పూర్తిగా క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. గత నెలలో కూడా గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలో సీతానగరం ప్రకాశం బ్యారేజీ ఎగువ భాగంలో పెద్ద ఎత్తున నాగ దేవత విగ్రహాలు బయటపడ్డాయి. ఎవరో వ్యక్తులు వాటిని తీసుకొచ్చి ఇక్కడ కుప్పగా పోశారనే ప్రచారం జరిగింది.