పోలవరం ప్రాజెక్ట్ మీవల్ల కాకపోతే కేంద్రానికివ్వండి..పురంధేశ్వరి
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ చీఫ్గా పురంధేశ్వరి బాధ్యతలు స్వీకరించిన వెంటనే తన మాటలకు పదును పెట్టారు. ఏపీలోని రోడ్ల దుస్థితిపై ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు.. కేంద్రం వేసిన రోడ్లు తప్పా రాష్ట్రం బాధ్యత ఏదని పురంధేశ్వరి ప్రశ్నించారు. అదే విధంగా పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రంపై కావాలనే అభాండాలు వేస్తున్నారన్నారు. కేంద్రం ఇస్తున్న నిధులపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాలన్నారు పురంధేశ్వరి.
విజయవాడలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పురంధేశ్వరి మాట్లాడుతూ.." అభివృద్ధికి పెద్దపీట వేసిన పార్టీ బీజేపీ. అన్ని వర్గాలకు న్యాయం చేశాం. కేంద్రం ఎన్నో అభివృద్ధి పథకాలు అమలు చేస్తోంది. ఏపీకి కేంద్రం 22 లక్షలకు పైగా ఇళ్లు ఇచ్చింది. ఏపీలోని రోడ్లు చాలా అద్ధ్వాన్నంగా ఉన్నాయి. జాతీయ రహదారుల నిర్మాణం కూడా కేంద్రం చలవే. కేంద్రం వేసిన రోడ్లు తప్ప రాష్ట్రం వేసిన రోడ్లెక్కడ?. కేంద్రం ఇస్తున్న నిధులు ఏమైపోతున్నాయి?. కేంద్రం నిధులపై రాష్ట్ర ప్రభుత్వం లెక్కలు చెప్పాలి. పరిశ్రమలు రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోతున్నాయ్. రాష్ట్రంలో మహిళలకు ప్రజాప్రతినిధులకు రక్షణ లేదు. నాణ్యతలేని మద్యంతో మహిళల పుస్తెలు తెంపుతున్నారు. రాష్ట్రంలో అవినీతి నిజం కాదా?
ఆర్బీకే సెంటర్ల నిర్మాణాల్లోనూ కేంద్రం పాత్ర ఉంది. రైతులకు అన్ని విధాలుగా కేంద్రం అండగా ఉంది. కేంద్రం ఇచ్చే ఆరువేలను కలుపుకుని రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా ఇస్తోంది. రైతులకు ఆర్థికసాయం తమగొప్పగా రాష్ట్రం చెప్పుకుంటోంది. పోలవరం విషయంలో కేంద్రం ఎప్పుడూ వెనకడుగు వేయదు . రాష్ట్రం నుంచి వచ్చే లెక్కల్లోనే జాప్యం ఉండొచ్చు. పోలవరం విషయంలో కేంద్రంపై అభాండాలు వేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్ మీవల్ల కాకపోతే కేంద్రానికివ్వండి. ఏపీ ప్రభుత్వం రూ.40-50 వేల కోట్ల బిల్లులు కాంట్రాక్టర్లకు చెల్లించాల్సి ఉంది" అని లెక్కలతో సహా రఫ్పాడించారు పురంధేశ్వరి.