జగన్ అధ్యక్షతన భేటీకానున్న ఏపీ కేబినెట్
X
సీఎం జగన్ అధ్యక్షతన ఏపీ కేబినెట్ ఇవాళ భేటీ కానుంది. ఉదయం 11 గంటలకు వెలగపూడిలోని సచివాలయంలో సమావేశం జరగనుంది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి సీపీఎస్ రద్దుపై మంత్రిమండలి ఆమోదం తెలపనుంది. పాత పింఛను పథకానికి బదులుగా సీపీఎస్ స్థానంలో కొత్త విధానానికి కేబినెట్ ఆమోదం తెలుపనున్నారు.
ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వచ్చే పింఛనుకు 50శాతానికి తగ్గకుండా కొత్త స్కీం ఉండనుంది.
సీపీఎస్తో పాటు పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడంపై మంత్రిమండలిలో చర్చించనున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులు, ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి తదితర అంశాలు కేబినెట్ భేటీలో చర్చకు వచ్చే అవకాశముంది. మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. 5వ తేదీ మధ్యాహ్నానికే ఆయా ప్రతిపాదనలన్నీ కూడా సాధారణ పరిపాలన శాఖకు చేరాయి.
మరోవైపు ఏపీ మంత్రివర్గ సమావేశం ముగిసిన వెంటనే సీఎం జగన్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా పర్యటనకు వెళ్లనున్నారు. మలికిపురంలో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాదరావు కుమారుడి వివాహానికి హాజరై.. నూతన దంపతులను ఆశీర్వదిస్తారు. అనంతరం అక్కడి నుంచి బయల్దేరి తిరిగి తాడేపల్లి నివాసానికి చేరుకుంటారు.