తిరుమలలో మరో చిరుత కలకలం.. భయాందోళనలో భక్తులు
X
తిరుమలలో చిరుతల సంచారం కలకలం రేపుతోంది. మళ్లీ చిరుత కనిపించడంతో భక్తులు భయాందోళనకు గురవుతున్నారు. బుధవారం ఐదో చిరుత బోనులో చిక్కిన ఘటన మరువక ముందే తాజాగా తిరుమలలోని స్పెషల్ కాటేజీ సమీపంలో భక్తులు బస చేసే ప్రాంతంలో చిరుత సంచారం ఆందోళనకు గురిచేస్తోంది. 3 రోజుల క్రితం ఈవో క్వార్టర్స్ వద్ద కనిపించిన చిరుత, ప్రస్తుతం కాటేజ్ వద్ద కనిపించిన చిరుత ఒకటేనా అనే కోణంలో అటవీ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
భక్తుల భద్రతకు సంబంధించి చర్యలు చేపట్టిన టీటీడీ చిరుతలను పట్టుకునేందుకు అటవీ అధికారులతో కలిసి బోన్లు ఏర్పాటు చేసింది. అయితే ఎవరూ ఊహించని విధంగా ఐదు చిరుతలు బోనులో చిక్కాయి. చిరుతల దాడి నుంచి కాపాడుకునేందుకు భక్తులకు కర్రలను అందించడం ప్రారంభించిన రోజునే చిరుత బోనులో చిక్కడం విశేషం. ఈ క్రమంలో తిరుమలకు, అలిపిరి మెట్లకు సమీపంలోనే మరికొన్ని చిరుతలు సంచరిస్తున్నట్లు సీసీ కెమెరాల ద్వారా అధికారులు గుర్తించడం కలవరపాటుకు గురిచేస్తుంది.