తిరుమలలో చిక్కిన మరో చిరుత..
X
తిరుమల నడకదారిలో మరో చిరుత చిక్కింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద ఏర్పాటు చేసిన బోనులో చిరుత పడింది. మూడు రోజుల క్రితం ఓ చిరుత చిక్కగా.. ఇప్పుడు మరో చిరుతను అధికారులు బంధించారు. అలిపిరి నడకదారి పరిసరాల్లో 5 చిరుతలు సంచరిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే రెండు చిక్కగా.. మిగితా వాటి కోసం ఆపరేషన్ కొనసాగుతోంది. చిరుతల్ని పట్టుకోవడానికి మోకాలిమిట్ట, లక్ష్మీనరసింహస్వామి ఆలయం, 35వ మలుపు వద్ద అటవీశాఖ అధికారులు బోన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా నడకదారిలో 500 సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు.
చిరుతల సంచారం నేపథ్యంలో నడకదారిలో పిల్లల ఎంట్రీపై టీటీడీ ఆంక్షలు విధించింది. కాలినడక మార్గంలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15ఏళ్లలోపు పిల్లలకు అనుమతి నిలిపివేసింది. ఇక నడకదారిలో వచ్చే పిల్లలకు పోలీసులు ట్యాగులు వేస్తున్నారు. తల్లితండ్రుల నుంచి పిల్లలు తప్పిపోతే కనిపెట్టేందుకు ఈ ట్యాగులను వేస్తున్నారు. ట్యాగ్పై పేరు తల్లిదండ్రుల వివరాలు ఫోన్ నంబర్ ఉంటాయి. వీటి ఆధారంగా పోలీసులు తప్పిపోయిన పిల్లల తల్లిదండ్రులను గుర్తిస్తారు. నడకదారిలో పిల్లల పట్ల తల్లిదండ్రులు ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
కాగా తిరుమలలో చిరు దాడిలో లక్షిణ అనే చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. నెల్లూరు జిల్లాకు చెందిన ఓ కుటుంబం గత శుక్రవారం సాయంత్రం నడక మార్గంలో తిరుమల కొండపైకి బయలు దేరింది. కాలినడకన తిరుమలకు వస్తున్న క్రమంలో ఆరేళ్ల చిన్నారి తప్పిపోయింది. శనివారం ఉదయం నరసింహ స్వామి ఆలయం వద్ద చెట్ల పొదల్లో చిన్నారి మృతదేహం లభించింది. చిరుత దాడి చేయడంతోనే చిన్నారి మృతిచెందినట్లు తెలుస్తోంది.