Home > ఆంధ్రప్రదేశ్ > Ap budget-2024 : ఏపీ బడ్జెట్‌.. బుగ్గన ప్రసంగంలో కీలక అంశాలివే

Ap budget-2024 : ఏపీ బడ్జెట్‌.. బుగ్గన ప్రసంగంలో కీలక అంశాలివే

Ap budget-2024 : ఏపీ బడ్జెట్‌.. బుగ్గన ప్రసంగంలో కీలక అంశాలివే
X

ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌‌ను ప్రవేపెట్టినప్పుడు తమ ప్రభుత్వ పాలనపై మాట్లాడారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిబద్ధతతో తమ పాలన సాగుతోందన్నారు. ఇప్పటి వరకూ ఎవ్వరూ చేయని పనులు వైఎస్ జగన్ సర్కార్ చేసిందన్నారు. 1.35 లక్షల మంది ఉద్యోగులతో గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశామని, కుప్పంతో సహా అనేక కొత్త రెవిన్యూ డివిజన్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రతి జిల్లాలో దిశా పోలీసు స్టేషన్లను ఏర్పాటు చేశామన్నారు. 99.81 శాతం పాఠశాలల్లో మౌలిక వసతులను కల్పించామన్నారు. నాడు-నేడు పథకం అమలు కోసం రూ.16 వేల కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు చెప్పుకొచ్చారు. రాష్ట్ర రహదారుల అభివృద్ధికి రూ.2626 కోట్లు, జిల్లా రహదారుల అభివృద్ధికి రూ.1955 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు.

ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం ద్వారా రూ.25 లక్షల వరకూ నగదు రహిత వైద్య సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. క్యాన్సర్ వంటి వ్యాధులకు ఎలాంటి పరిమితి లేకుండా వైద్యం అందిస్తున్నామన్నారు. ఏపీలో ఫ్యామిలీ డాక్టర్ అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. అమ్మఒడి పథకం ద్వారా 43.61 లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.26,067 కోట్లు జమ చేశామని, ఈ పథకం వల్ల 83 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరినట్లు చెప్పుకొచ్చారు. స్వయం సహాయక బృందాలకు వైఎస్ఆర్ ఆసరా కింద 2019 నుంచి రూ.25,571 కోట్ల బకాయిలను చెల్లించినట్లు తెలిపారు. కొత్తగా 17 ప్రభుత్వ వైద్య కళాశాలలను మంజూరు చేసినట్లు తెలిపారు.

వైఎస్సార్ సున్నా వడ్డీ కింద స్వయం సహాయక బృందాలకు రూ.4,969 కోట్లు పంపిణీ చేశామని, గత ఐదేళ్లలో 30.65 లక్షలకుపైగా ఇళ్ల పట్టాలను పంపిణీ చేసినట్లు తెలిపారు. సుమారు రూ.33 వేల కోట్లతో జగనన్న కాలనీల్లో మౌలిక వసతులు కల్పిస్తున్నామని, వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారుల వయసును 65 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు తగ్గించామని, జనవరి నుంచి నెలకు రూ.3 వేలు పెన్షన్ ఇస్తున్నామని, ఆరోగ్య ఫించన్లను రూ.10 వేలకు పెంచినట్లు వెల్లడించారు. రూ.20 వేల కోట్లతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, కాకినాడలో పోర్టులు నిర్మించినట్లు తెలిపారు. వాటి ద్వారా 75 వేల మంది ఉపాధి లభించిందన్నారు.


Updated : 7 Feb 2024 6:55 AM GMT
Tags:    
Next Story
Share it
Top