అవుకు రెండో టన్నెల్ ప్రారంభించిన సీఎం జగన్
X
రాయలసీమ ప్రజల సాగునీటి కష్టాలు తీరనున్నాయి. ఎట్టకేలకు సీమ ప్రజల చిరకాల కోరిక నెరవేరింది. గాలేరు - నగరి సుజల స్రవంతిలో భాగంగా నిర్మించిన అవుకు రెండో టన్నెల్‌ను ఏపీసీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ టన్నెల్తో అవుకు రిజర్వాయర్కు 20 వేల క్యూసెక్కుల నీటిని తరలిచేందుకు మార్గం సుగమమైంది. అవుకు టన్నెల్ను ప్రారంభించిన జగన్.. గోరకల్లు రిజర్వాయర్ నుంచి అవుకు రిజర్వాయర్కు 20వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
శ్రీశైలానికి వరద వచ్చే సమయంలో రోజుకు 20 వేల క్యూసెక్కుల చొప్పున 30 రోజుల్లో 38 టీఎంసీలను తరలించి.. ఉమ్మడి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.60 లక్షల ఎకరాలకు సాగునీరు, 640 గ్రామాల్లో తాగునీటిని అందించే గాలేరు - నగరి సుజల స్రవంతిని 2005లో దివంగత వైఎస్సార్ చేపట్టారు. గోరకల్లు రిజర్వాయర్ నుంచి 20 వేల క్యూసెక్కుల సామర్థ్యంతో 57.7 కి.మీ. పొడవున వరద కాలువ, దీనికి కొనసాగింపుగా అవుకు రిజర్వాయర్ వద్ద కొండలో 5.7 కి.మీ. పొడవున ఒక సొరంగం తవ్వకం పనులు చేపట్టారు.
మరోవైపు టన్నెల్ 3 పనులు జోరుగా సాగుతున్నాయి. మొత్తం 5.801 కి.మీ. పొడవైన మూడో టన్నెల్‌లో ఇప్పటికే 4.5కి.మీ. పొడవైన పనులు పూర్తయ్యాయి. ఇక కేవలం 1.2 కి.మీ పనులు మాత్రమే మిగిలాయి. మొత్తం మూడు టన్నెళ్ల కోసం ఇప్పటిదాకా రూ.1,501.94 కోట్లు వ్యయం చేయగా వీటి ద్వారా 30 వేల క్యూసెక్కుల నీటిని తరలించనున్నారు. పెన్నా డెల్టాకు జీవనాడులైన నెల్లూరు, సంగం బ్యారేజ్‌లను ఇప్పటికే పూర్తి చేసి గతేడాది సెప్టెంబరు 6న జాతికి అంకితం చేయగా కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పశ్చిమ మండలాలకు తాగు, సాగునీటిని అందించే లక్ష్యంతో హంద్రీ–నీవా నుంచి 77 చెరువులను నింపే ఎత్తిపోతలను పూర్తి చేసి సెప్టెంబరు 19న సీఎం జగన్ జాతికి అంకితం చేసిన విషయం తెలిసిందే.