వడ్డీ లేని రుణాలు.. నేడు మీ అకౌంట్లలోకి రూ.10 వేలు..
X
ఏపీలో చిరు వ్యాపారులకు గుడ్‌న్యూస్. నేడు ‘జగనన్న తోడు’ (ఏడో విడత) పథకం కింద లబ్ధి దారుల ఖాతాల్లో రూ.10 వేలు జమకానున్నాయి. ఈ ఉదయం తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ బటన్ నొక్కి నిధులు జమ చేయనున్నారు. మొత్తం 5,10,412 మంది లబ్ధిదారులకు రూ.560.73 కోట్లు విడుదల చేయనున్నారు. అలాగే రూ.11.03 కోట్ల వడ్డీ రీయంబర్స్ మెంట్ కూడా విడుదల చేయనున్నారు. ఒక్కొక్కరికి రూ.10 వేల నుంచి 13వేల వరకు వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు. తోపుడు బండ్ల వ్యాపారులు, హస్తకళాకారులు, చేతివృత్తుల వారికి అండగా ప్రభుత్వం ఈ నిధుల్ని విడుదల చేస్తోంది. వడ్డీ వ్యాపారుల నుండి చిరు వ్యాపారులను ఆదుకుంటున్నారు. చిరువ్యాపారులకు పెట్టుబడి సాయంగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా చిరువ్యాపారులకు చేయూతనందించడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన కార్యక్రమం ‘జగనన్న తోడు’. 2020 నవంబరు 25వ తేదీన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమం కింద చిరు వ్యాపారులకు ఎలాంటి పూచీకత్తు లేకుండా తొలిసారి రూ. 10,000 రుణం అందజేయడంతో పాటు తీసుకున్న రుణాన్ని ప్రతి నెలా కిస్తీ రూపంలో సకాలంలో చెల్లించే వారికి ఆ రుణంపై అయ్యే వడ్డీ మొత్తం ప్రభుత్వమే తిరిగి చెల్లిస్తుంది. వారికి మరింత రుణ సాయాన్ని కూడా అందిస్తుంది. మొదటి విడతలో రూ.10 వేలు రుణం తీసుకొని నిర్ణీత కాలంలో చెల్లించిన వారికి రెండో విడత ఓ వెయ్యి పెంచి రూ. 11 వేలు, రెండో విడత రుణం కూడా చెల్లించిన వారికి మూడో విడతలో రూ. 12 వేలు.. ఇలా ప్రతి ఏటా పెంచుతూ రుణాలు అందజేస్తోంది. కొత్త వారికి కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తోంది. ఈ పథకం ద్వారా లబ్ది పొందే వారిలో దాదాపు 85% మహిళలే కావడం గమనార్హం.