Home > ఆంధ్రప్రదేశ్ > 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. రేపు ఆవిష్కరించనున్న ఏపీ సీఎం జగన్

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. రేపు ఆవిష్కరించనున్న ఏపీ సీఎం జగన్

125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం.. రేపు ఆవిష్కరించనున్న ఏపీ సీఎం జగన్
X

అణగారిన వర్గాల స్వేచ్ఛ ప్రదాత, భారత రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ విగ్రహం ఆవిష్కరణకు విజయవాడ సిద్ధమైంది. నగరం నడిబొడ్డున స్వరాజ్య మైదానంలో నిర్మించిన 208 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని శుక్రవారం సీఎం జగన్మోహన్ రెడ్డి ఆవిష్కరించనున్నారు. 85 అడుగుల పీఠంపై 125 అడుగుల అంబేడ్కర్ కాంస్య విగ్రహం విజయవాడ నగరానికి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

అంబేడ్కర్‌ ఆదర్శాలు, ఆలోచనలను భావితరాలకు అందించే గొప్ప ప్రయత్నంగా.. సామాజిక న్యాయ మహాశిల్పంగా అంబేడ్కర్‌ స్మృతి వనాన్ని తీర్చిదిద్దారు. ఇరిగేషన్ శాఖకు చెందిన దాదాపు 18 ఎకరాల్లో ఈ స్థలంలో ఏపీ ఇండస్ట్రీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ కు చెందిన కేపీసీ ప్రాజెక్ట్స్ లిమిటెడ్ ఈ విగ్రహాన్ని నిర్మించింది. నోయిడాలోని డిజైన్‌ అసోసియేట్స్‌ ఈ డిజైన్ రూపొందించింది. రూ.170కోట్లతో చేపట్టిన ప్రాజెక్టు చేపట్టగా.. పూర్తయ్యేసరికి వ్యయం రూ.404.35 కోట్లకు చేరింది. 85 అడుగుల ఎత్తులో నిర్మించిన రెండంతస్తుల కాంక్రీట్ పీఠంపై 125 అడుగుల డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. స్వాతంత్య్ర ఉద్యమంలో పోరాటాలకు వేదికైన స్వరాజ్య మైదానాన్ని ఇకపై డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ స్వరాజ్ మైదాన్‌గా పిలవనున్నారు.

అంబేడ్కర్ స్మృతి వనంలో డా. బీఆర్ అంబేద్కర్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్, 2వేల మంది కూర్చునేలా కన్వెన్షన్ సెంటర్, ఫుడ్ కోర్ట్, చిల్డ్రన్స్ ప్లే ఏరియా, వాటర్‌ బాడీస్, మ్యూజికల్ ఫౌంటెన్, లాంగ్ వాక్‌ వేస్‌ నిర్మించారు. అంబేడ్కర్ విగ్రహాన్ని స్టీల్ ఫ్రేమింగ్‌తో తయారు చేసి కాంస్యంతో తయారు చేసిన క్లాడింగ్‌తో రూపమిచ్చారు. ఇందుకోసం 400 మెట్రిక్‌ టన్నుల స్టెయిన్‌లెస్ స్టీల్, 120 మెట్రిక్ టన్నుల కాంస్యం వినియోగించారు. బౌద్ధ వాస్తుశిల్పంలోని కాలచక్ర మహా మండల రూపంలో పీఠాన్ని రూపుదిద్దారు. విగ్రహం పీఠం G+2 ఐసోసెల్స్ ట్రాపెజియం ఆకారంలో నిర్మించారు.

విగ్రహ పీఠం ఉన్న పెడెస్టల్ బిల్డింగ్ ను రాజస్థాన్ నుంచి తెచ్చిన గులాబీ రంగు ఇసుకరాయితో రూపొందించారు. స్మారక చిహ్నం ముందుభాగంలో 6 నీటి కొలనుల్ని ఏర్పాటు చేశారు. మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అంబేడ్కర్ విగ్రహ నిర్మాణం కోసం నిత్యం 500 నుంచి 600 మంది కార్మికులు పనిచేశారు. 55 మంది టెక్నికల్, సపోర్టింగ్ ఉద్యోగులు రెండేళ్ల పాటు రేయింబవళ్లు పనిచేశారు.




Updated : 18 Jan 2024 6:46 PM IST
Tags:    
Next Story
Share it
Top