Home > ఆంధ్రప్రదేశ్ > ఏపీలోనూ తెలంగాణ ప్లాన్.. అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు

ఏపీలోనూ తెలంగాణ ప్లాన్.. అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు

ఏపీలోనూ తెలంగాణ ప్లాన్.. అభ్యర్థుల నుంచి అప్లికేషన్లు
X

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన జోష్తో కాంగ్రెస్ పార్టీ ఏపీలోనూ సత్తా చాటాలని భావిస్తోంది. ఇందుకోసం వ్యూహాలకు పదునుపెడుతోంది. 175 అసెంబ్లీతో పాటు 25 ఎంపీ సీట్లలో మెజార్టీ స్థానాలు ఖాతాలో వేసుకునేందుకు ప్లాన్ రెడీ చేసింది. గెలుపు కోసం తెలంగాణలో అనుసరించిన విధానాన్నే ఏపీలోనూ అమలుచేయాలని కాంగ్రెస్ నిర్ణయించింది.

అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలకు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉండటంతో కాంగ్రెస్ జోరు పెంచింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల తరహాలోనే అభ్యర్థుల ఎంపిక కోసం అప్లికేషన్లు స్వీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ చేపట్టింది. విజయవాడలోని పార్టీ కార్యాలయంలో ఏపీ వ్యవహారాల ఇంఛార్జ్ మాణికం ఠాగూర్ ఈ కార్యక్రమం ప్రారంభించారు. అసెంబ్లీ, లోక్ సభ స్థానాల్లో పోటీ చేయాలని భావిస్తున్న అభ్యర్థులకు దరఖాస్తులు అందజేశారు.

కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేయాలనుకునే నాయకులు, కార్యకర్తలు ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని కాంగ్రెస్ ప్రకటించింది. అభ్యర్థులు దాఖలు చేసిన అప్లికేషన్లను స్క్రీనింగ్ కమిటీ పరిశీలించనుంది. కమిటీ ఎంపిక చేసిన వారి వివరాలను కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీకి పంపనున్నారు. ఎలక్షన్ కమిటీ బరిలో నిలిపే తుది అభ్యర్థుల పేర్లు ప్రకటించనున్నారు. మరోవైపు ఏపీలో పొత్తులకు సిద్ధమని కాంగ్రెస్ ప్రకటించింది. భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని మాణికం ఠాగూర్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే తెలంగాణలో అభ్యర్థుల ఎంపికకు అనుసరించిన విధానాన్నే ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లోనూ ఫాలో కానుండటంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated : 24 Jan 2024 2:28 PM GMT
Tags:    
Next Story
Share it
Top