తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు.. ఏపీ మంత్రి
X
తెలంగాణ విద్యా వ్యవస్థపై ఏపీ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘తెలంగాణ విద్యా వ్యవస్థలో చూచిరాతలు, కుంభకోణాలు రోజూ చూస్తూనే ఉన్నాం. ఉపాధ్యాయుల బదిలీలు కూడా చేసుకోలేని దుస్థితి తెలంగాణది. మన విధానం మనది, మన ఆలోచనలు మనవి’’ అని వ్యాఖ్యానించారు. ఏపీ విద్యా విధానాన్ని తెలంగాణతో పోల్చి చూడటం సరికాదన్నారు. గురువారం విజయవాడలో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలోని 4 ట్రిపుల్ ఐటీలకు ఎంపికైన అభ్యర్థుల జాబితా (IIIT admissions results)ను విడుదల చేశారు మంత్రి. ఈ సందర్భంగానే తెలంగాణలో జరిగిన టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ అంశాల గురించి పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు.
ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం క్యాంపస్‌లో కలిపి మొత్తం 4,400 సీట్లు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు. ఈ నెల 20 నుంచి 25 వరకు ట్రిపుల్ ఐటీ ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. మెరిట్ లో వచ్చిన విద్యార్థులను ప్రవేశం దొరుకుతుందన్నారు. టాప్ 20 వచ్చిన విద్యార్థులు అందరూ ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన వారేనని తెలిపారు. ఆర్జీయుకేటీ ల్లో కొంత స్టాఫ్ సమస్య వుందని, 100 శాతం అధ్యాపకులను నియమిస్తామని తెలిపారు. ఒంగోలులో అకామిడేషన్ సమస్య ఉందని, త్వరలో టెండర్లు పిలుస్తామన్నారు.