AP Election Survey 2024 : ఏపీ ఎన్నికలపై కీలక సర్వే.. అచ్చం కర్నాటక ఫలితాలే...
X
వచ్చే ఎన్నికల్లోనూ తామే గెలుస్తామని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం పీకల్లోతు అవినీతిలో కూరుకుపోయిందని, ఈసారి ప్రజలు తమకే పట్టం కడతారని చంద్రబాబు అంటున్నారు. మధ్యలో జనసేన కూడా బీజేపీ అండతో ఏదో సాధించి తీరతామని చెబుతోంది. ఎన్నికలకు గట్టిగా ఏడాది వ్యవధి కూడా లేకపోవడంతో పార్టీలు జోరు పెంచాయి. జగన్ సభలు, చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన, లోకేశ్ బాబు పాదయాత్ర, పవన్ కల్యాణ్ ‘వారాహి విజయ యాత్ర’లతో ఏపీ రాజకీయాలు వానాకాలంలో వేడి పుట్టిస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయనేదానిపై ఇప్పటికే పలు సర్వేలు వెల్లడయ్యాయి. తాజాగా ‘పొలిటికల్ క్రిటిక్’ సంస్థ కూడా సర్వే చేసి ఫలితాలు వెల్లడించింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే గెలుపోటములు ఎవరివని ఓటర్లను అడిగి ఫలితాలు విశ్లేషించింది. అసెంబ్లీ ఎన్నికలతోపాటు పార్లమెంట్ ఎన్నికలపైనా సర్వే చేసింది. ఈ సంస్థ కర్నాటక ఎన్నికలపై చేసిన సర్వే పొల్లుపోకుండా నిజం కావడంతో ఏపీ సర్వే రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
అసెంబ్లీ ఎన్నికల్లో..
• పొలిటికల్ క్రిటిక్ సర్వే ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు గాను అధికార వైస్సార్ కాంగ్రెస్ పార్టీకి 135 స్థానాలు స్థానాలు రావొచ్చు. టీడీపీకి 35, టీడీపీ, జనసేనలకు కలిపి 5 సీట్లు దక్కొచ్చు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీకి 151, టీడీపీ 23 సీట్లు దక్కాయి.
• వైసీపీకి 49.5 శాతం ఓట్లు, పచ్చపార్టీకి 38.5 శాతం ఓట్లు రావొచ్చు. బీజేపీ, జనసేనలకు కలిపి 8 శాతం పడొచ్చు. కాంగ్రెస్ ఈసారి కూడా గల్లంతవుతుంది. ‘ఇండియా’ కూటమికి 2.5 శాతం పడొచ్చు. 2019 ఎన్నికల్లోనూ వైసీపీ, టీడీపీలకు ఈ సర్వేలో అంచనా వేసిన ఓట్లే పడ్డాయి.
లోక్‌సభ ఎన్నికల్లో
ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఏపీలోని మొత్తం 25 లోక్‌సభ స్థానాలకు గాను అధికార పార్టీకి 51 శాతం ఓట్లతో 21 సీట్లు దక్కొచ్చు. చంద్రబాబు పార్టీకి 37.5 శాతం ఓట్లతో 4 స్థానాలు కైవసం చేసుకునే అవకాశం ఉంది. బీజేపీ, జనసేనలకు కలిపి ఏడు శాతం రావొచ్చు.
హవా తగ్గింది!
పొలిటికల్ క్రిటిక్ సర్వేతోపాటు ఇటీవల వెలువడిన మరికొన్ని సర్వేలో జగన్ పార్టీకి రాబోయే సీట్లు గత ఎన్నికల్లో పోలిస్తే పది నుంచి 20 వరకు తగ్గడం గమనార్హం. వైసీపీ ఎన్ని ప్రజాకర్షక పథకాలు పెట్టినా ప్రభుత్వంపై ఓటర్లలో కొంత అసంతృప్తి ఉన్నట్లు తెలుస్తోంది. ఉపాధి అవకాశాలు తగ్గడం, రాజధాని వివాదం, అధికార పార్టీ నేతల అవినీతి అక్రమాలు పార్టీ మెజారిటీని తగ్గిస్తాయనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.