ఏపీ ఇంజినీరింగ్ వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం..
X
ఏపీలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఆగస్టు 7న మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభించారు. ఉదయం 12 గంటలకే ప్రారంభం కావాల్సి ఉన్న సాంకేతిక కారణాలతో కాస్త ఆలస్యమైంది. ఈఏపీసెట్ కౌన్సెలింగ్‌లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు ఆప్షన్లు నమోదుచేసుకోవచ్చు. ఆగస్టు 7 నుంచి 12 వరకు వెబ్ ఆప్షన్లను నమోదుచేయడానికి అవకాశం కల్పించారు. వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకున్నవారికి ఆగస్టు 17న సీట్లను కేటాయించనున్నారు. . సీట్లు పొందిన అభ్యర్థులు ఆగస్టు 21లోపు సంబంధిత కళాశాలల్లో చేరాల్సి ఉంటుంది.
కౌన్సెలింగ్ జాబితా నుంచి పలు కాలేజీలను ఏపీ ప్రభుత్వం తొలగించింది. విశ్వవిద్యాలయాలకు అనుబంధ గుర్తింపు, ఇతరత్ర సేవల కింద చెల్లించాల్సిన ఫీజుల బకాయిలను సదరు కళాశాలలు చెల్లించలేదని కారణంగా 73 కాలేజీలకు అనుమతులు నిలిపివేసింది. దీంతో ఆయా కలాశాలలు లిస్ట్‌లో కనిపించలేదు. ఏఐసీటీఈ 252 కళాశాలలకు అనుమతులిచ్చినప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం 179 కళాశాలలను మాత్రమే కౌన్సెలింగ్‌కు అనుమతించింది. వర్సిటీలు ఎలాంటి సేవలు అందించకుండానే ఫీజులు వసూలు చేస్తున్నాయంటూ దాదాపు 50 కళాశాలలు హైకోర్టును గతంలోనే ఆశ్రయించాయి. వీటిలో 11 కళాశాలలను కౌన్సెలింగ్‌లో పెట్టాలని ఇప్పటికే న్యాయస్థానం మధ్యంతర ఉత్తర్వులిచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. బోధనారుసుముల చెల్లింపు భారాన్ని తగ్గించుకునేందుకే అనుమతులు నిలిపివేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూలు ఇలా..
*ఆప్షన్ల నమోదు: 07.08.2023 నుంచి 12.08.2023 వరకు.
*ఆప్షన్లలో మార్పులు: 13.08.2023.
*సీట్ల కేటాయింపు: 17.08.2023.
*సెల్ఫ్ రిపోర్టింగ్(ఆన్‌లైన్), సంబంధిత కాలేజీల్లో రిపోర్టింగ్: 18.08.2023 నుంచి 21.08.2023 వరకు.
*ఇంజినీరింగ్ తరగతులు ప్రారంభ తేదీ: 23.08.2023