స్కిల్ డెవలప్మెంట్ స్కాంలో మాజీ మంత్రి గంటా అరెస్ట్
X
ఏపీలో అరెస్ట్ల కలకలం కొనసాగుతోంది. స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో సీఐడీ అధికారులు వరుస అరెస్టులు చేస్తున్నారు. నంద్యాలలో చంద్రబాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు ఇదే సమయంలో టీడీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ఆయన కొడుకు రవిచంద్రను అరెస్ట్ చేశారు. తెల్లవారుజామున దిశ ఏసీపీ వివేకానంద నేతృత్వంలో విశాఖలోని గంటా నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో మంత్రిగా ఉన్న గంటా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నిర్వాహణలో అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి.
చంద్రబాబు సీఎంగా ఉన్న సమయంలో గంటా శ్రీనివాసరావు విద్యాశాఖ మంత్రిగా పని చేశారు. స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం ఏర్పాటులో అవకతవకలకు పాల్పడినట్లు సీఐడీ ఆయనపై అభియోగాలు మోపింది. ఇప్పటికే ఈ కేసులో పోలీసులు ఇప్పటికే 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. షెల్ కంపెనీల ఏర్పాటు చేసి భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని సీఐడీ, ఈడీ ఆరోపిస్తున్నాయి. ఈ క్రమంలోనే గంటాతో పాటు ఆయన కుమారుడు రవిచంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. వారిద్దరిని విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు తరలిస్తున్నట్లు సమాచారం. అరెస్ట్కు సంబంధించి సీఐడీ అధికారులు కాసేపట్లో మీడియా సమావేశం ద్వారా పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.