Nagarjuna Sagar Dam : సాగర్ కుడికాలువకు కొనసాగుతున్న నీటి విడుదల
X
నాగార్జున సాగర్పై ఆధిపత్యం కోసం ఏపీ ప్రభుత్వం కాలుదువ్వుతోంది. ఫలితంగా సాగర్ వద్ద ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. డ్యామ్ 13వ గేట్ వరకు ఆక్రమించుకున్న ఆంధ్రా పోలీసులు కుడి కాలువకు నీటిని విడుదల కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టులో ప్రస్తుతం నీటినిల్వ 522 అడుగులకు చేరింది. నీటి విడుదల ఇలాగే కొనసాగితే ప్రాజెక్టు త్వరలోనే డెడ్ స్టోరేజీకి చేరే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ఇప్పటి వరకు దాదాపు 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసుకుంది. మరో 12 అడుగుల మేర నీటిని విడుదల చేస్తే డెడ్ స్టోరేజీకి పడిపోనుంది.
ఇదిలా ఉంటే డ్యామ్‌కు ఇరువైపులా రెండు రాష్ట్రాలు భారీగా పోలీసులను మోహరించాయి. ప్రస్తుతం డ్యామ్ వద్ద దాదాపు 1400 మంది ఏపీ పోలీసులు ఉన్నారు. వారు 13వ గేట్ వరకు డ్యామ్ తమదని వాదిస్తూ అక్కడ ముళ్ల కంచెలు, బారికేడ్లు ఏర్పాటు చేసి రోడ్డును మూసివేశారు. దీంతో డ్యామ్‌పై విధులు నిర్వహించే సిబ్బంది 13వ గేట్ దాటి అటువైపు ఉన్న తెలంగాణ కంట్రోల్ రూమ్ వైపు వెళ్లలేకపోతున్నారు. మరోవైపు నాగార్జున సాగర్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నీటిని విడుదల చేసుకోవడంపై తెలంగాణ అధికారులు కృష్ణా ట్రిబ్యునల్‌కు ఫిర్యాదు చేశారు.