టీచర్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.. ఆగస్టులో డీఎస్సీ నోటిఫికేషన్..?
X
టీచర్ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న నిరుద్యోగులకు వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ మేరకు ఓ ప్రకటన చేశారు. టీచర్ పోస్టుల భర్తీకి త్వరలో డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామని, ఆగస్టులో డీఎస్సీ ప్రకటన వెలువడే అవకాశముందని ఆయన స్పష్టం చేశారు.
ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి కసరత్తు ఇప్పటికే ప్రారంభమైందని మంత్రి బొత్స చెప్పారు. నిజానికి త్వరలోనే డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఈ ఏడాది ఏప్రిల్ లోనే మంత్రి ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తాజాగా టీచర్ పోస్టుల భర్తీపై దృష్టి సారించిన జగన్ సర్కారు ఇందుకు అవసరమైన విధివిధానాలు రూపొందించే పనిలో నిమగ్నమైంది. మరోవైపు టీచర్ల బదిలీల కోసం పారదర్శకమైన విధానాన్ని తీసుకొస్తామని బొత్స ప్రకటించారు. ఇందుకోసం ఇతర రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలను సైతం పరిశీలిస్తున్నట్లు చెప్పారు. మరోవైపు కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్లు మంత్రి బొత్స చెప్పారు.