AP Government Pension : పెన్షన్‌దారులకు జగన్ సర్కార్ న్యూ ఇయర్ గిఫ్ట్
X
పెన్షన్‌దారులకు ఏపీ ప్రభుత్వం కొత్త సంవత్సర కానుకనిచ్చింది. వైఎస్సార్ పెన్షన్ పధకం కింద సామాజిక పెన్షన్లను రూ.3 వేలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకూ రూ.2,750 అందిస్తుండగా, కొత్త ఏడాది నుంచి పింఛన్ మొత్తం రూ.3 వేలు చేసింది ఏపీ ప్రభుత్వం. వైఎస్సార్ పెన్షన్ కానుక పేరిట ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని వృద్ధులు, వికలాంగులు, చేనేత, కల్లుగీత కార్మికులు, మత్స్యకారులు, ఒంటరి మహిళలకు, వితంతువులు, ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్ అందిస్తోంది. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు రూ.1000గా ఉన్న పింఛన్ మొత్తాన్ని సీఎం జగన్ మొదట రూ.2,250కు పెంచారు. ఆపై దశలవారీగా పెంచుతామని హామీ ఇచ్చినట్లుగానే.. 2022లో రూ.2,500 చేశారు. 2023 జనవరి 1 నుంచి పింఛన్ మొత్తాన్ని రూ.2,750కు పెంచారు. 1 జనవరి 2024 నుంచి పెంచిన పింఛన్ రూ.3 వేలలు వైఎస్సార్ పెన్షన్ కానుక లబ్ధిదారులకు అందించనున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీని దశలవారీగా అమల్లోకి తెచ్చారు. పాదయాత్రలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఏటా పెన్షన్లను పెంచుతూ వస్తోంది సర్కార్. 8 రోజుల పాటు పండుగ వాతావరణంలో పెన్షన్ల పంపిణీ చేయాలని జగన్ సర్కార్ నిర్ణయించింది. మరోవైపు కొత్త లబ్ధిదారులకు పెన్షన్ కార్డులనూ పంపిణీ చేయనుంది ప్రభుత్వం. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు 52.17 లక్షల మంది పెన్షనర్లు ఉంటే డిసెంబర్ వరకూ 64.45 లక్షల మంది లబ్దిదారులున్నారు. తాజాగా మరో లక్షా 17 వేల 161 మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం. దీంతో జనవరి ఒకటి నుంచి మొత్తం 66.34 లక్షల మందికి పెన్షన్లు అందించనుంది. తాజాగా మూడు వేలకు పెన్షన్లు పెంచడంతో ప్రతి నెలా సగటున రూ. 1968 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఒకవైపు పెరిగిన పెన్షన్‌లు పంపిణీతో పాటు కొత్తగా అర్హత పొందినవారికి కొత్త పెన్షన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.