గుండె సమస్యలపై ప్రభుత్వం దృష్టి..కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం
X
మారుతున్న ఆహారపుల అలవాట్లు, ప్రజల దినచర్య, ధూమ పానం, మధ్యపానం వంటి కారణాలతో ఇటీవల కాలంలో గుండె సంబంధిత వ్యాధులు అధికమయ్యాయి. ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలిపోతున్నారు. తక్కువ వయుస్సు వారే గుండెపోటుకు గురవ్వడం, గుండె జబ్బుల బారిన పడడం కలకలం రేపుతోంది. ఈ విషయంపై తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. గుండె పోటు వచ్చాక ప్రాథమిక చికిత్స, ఆస్పత్రిలో అందించే చికిత్సపై అవగాహన లేకపోవడంతో పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. వైద్యం చేసేందుకు అధిక ఖర్చులు కూడా పేదవాడిని ఇబ్బంది పెడుతున్నాయి.
అయితే ఏపీ ప్రభుత్వం గుండె సంబంధిత వ్యాధులపై ఏపీ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. గుండెపోటుకు గురైన వారిని ప్రాణాలను రక్షించడమే లక్ష్యంగా కొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. గుండెపోటు వచ్చిన వారికి మొదటి గంటలోనే అత్యవసర ప్రాథమిక చికిత్స చేయడమనేది చాలా ముఖ్యమైన ప్రక్రియ. గోల్డెన్ అవర్‌లో చికిత్స అందించడం ద్వారా రోగి ప్రాణాలు నిలబెట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమయంలో రోగికి అవసరమైన చికిత్సను అందించి ప్రాణాపాయం నుండి కాపాడేందుకు ఐసీఎంఆర్ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం స్టెమి కార్యక్రమాన్ని ఏపీ ప్రభుత్వం ప్రారంభించింది.
మొదటి నలభై నిమిషాల్లో అత్యవసర చికిత్స అందించి రోగిని కాపాడడమే ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. దీనిలో భాగంగా గ్రామస్థాయిలో వైద్య సిబ్బందికి శిక్షణ ఇవ్వడం... సమీపంలోని పీహెచ్‌సీలలో ఇనిషియల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంచడం... అవసరమైన వారికి రూ.40 వేలు విలువ చేసే థ్రాంబోలైసిస్ ఇంజక్షన్ ఉచితంగా ఇవ్వడం చేస్తారు. అనంతరం
100 కిలో మీటర్ల పరిధిలో క్యాథ్ ల్యాబ్స్ ఉన్న డిస్ట్రిక్ట్ హబ్ హాస్పిటల్‌కు రోగిని తరలించి టెస్టులు, ఆపరేషన్స్ నిర్వహిస్తారు. ఇప్పటికే ఎంపిక చేసిన ఆసుపత్రుల్లో అవసరమైన సౌకర్యాలు, సిబ్బంది నియామకాలు చేపట్టింది. గ్రామస్థాయి సిబ్బంది, వైద్యులు శిక్షణ కూడా పూర్తి చేసుకున్నారు. రూ.120 కోట్లతో క్యాథ్ ల్యాబ్స్ నిర్మాణం చేపట్టింది. నాలుగు హబ్స్‌ను ఏర్పాటు చేసి చిత్తూరు, గుంటూరు, విశాఖ, కర్నూలు జిల్లాల పరిధిలో 61 స్టోక్స్‌ను ఏర్పాటు చేసి హార్ట్ కేర్ సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది. సెప్టెంబరు 29న రూపొందించిన స్టెమీ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.