జగన్ సర్కార్కు షాక్.. ఆర్5 జోన్‌లో ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే
X
ఏపీ ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలింది. అమరావతిలో ఆర్-5 జోన్ ఇళ్ల నిర్మాణంపై హైకోర్టు స్టే విధించింది. ఇళ్ల నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం గురువారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలోని ఆర్ 5 జోన్‌లో ఇళ్ల నిర్మాణాన్ని నిలిపేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టుల త్రిసభ్య ధర్మాసనం విచారణ జరిపింది.
ఇరువైపుల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది.
ఇవాళ ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అమరావతిలో ఆర్5 జోన్‌కి సంబంధించి సీఆర్డీఏ చట్టాన్ని సవరించి తెచ్చిన యాక్ట్ 13/2022, జీవో 45ని సవాల్ చేస్తూ కోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. దీనిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టూ ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ప్రభుత్వం ఎన్నికలకు ముందు అమరావతిలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు వేస్తున్న అడుగులకు తాత్కాలికంగా బ్రేక్ పడినట్లయింది.
అమరావతిపై హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ పిటిషన్లపై అత్యున్నత న్యాయస్థానంలో విచారణ కొనసాగుతోంది. ఈ క్రమంలోనే అక్కడ పేదలకు ఇళ్ల స్ధలాల కేటాయింపు, ఇళ్ల నిర్మాణం కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రభుత్వ నిర్ణయాన్ని పలువురు హైకోర్టులో సవాల్ చేశారు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.