తెలంగాణలో ఏ పార్టీని గెలిపించాల్సిన అవసరం లేదు : అంబటి
X
తెలంగాణ ఎన్నికలు సహా నాగార్జున సాగర్ వివాదంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. తెలంగాణలో తమ పార్టీ లేదని.. అక్కడ ఏ పార్టీని గెలపించాల్సిన అవసరం లేదన్నారు. ఇక నాగార్జున సాగర్ వ్యవహారాన్ని రాజకీయం చేయడం కరెక్ట్ కాదన్నారు. తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా తమకు సంబంధం లేదని చెప్పారు. తెలంగాణలో చంద్రబాబు కుల సంఘాలు కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చాయన్న మంత్రి... రాహుల్, ప్రియాంక గాంధీ సభల్లో కాంగ్రెస్ జెండాలతో పోటీగా టీడీపీ జెండాలు కనిపించాయన్నారు. జనసేన అభ్యర్థులను ఓడించడానికి చంద్రబాబు కులం నేతలు భారీగా డబ్బు ఖర్చు పెట్టారని ఆరోపించారు.
నాగార్జునసాగర్ వద్ద గురువారం తాము చేసిన చర్య న్యాయమైందని అంబటి అన్నారు. తాము తెలంగాణ భూభాగంలోకి వెళ్లలేదని.. ఏపీ భూభాగంలోకి ఏపీ పోలీసులు వెళ్తే దండయాత్ర ఎలా అవుతుందని ప్రశ్నించారు. రాష్ట్ర విభజన సమయంలో సాగర్ గేట్లను సమంగా పంచారని.. ఏపీ గేట్లను కూడా తెలంగాణ అధికారులే ఆపరేట్ చేస్తున్నారని ఆరోపించారు. కుడి కాల్వ నిర్వహణ తెలంగాణ చేతుల్లోకి ఎందుకు వెళ్లిందో ఆలోచించాలన్నారు. ఏపీ భూభాగంలోనూ తెలంగాణ పోలీసుల చెక్‌పోస్టులు ఉన్నాయన్నారు. తాగునీటి కోసం కూడా తెలంగాణ అనుమతి తీసుకోవాలా అని అడిగారు. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులు చెల్లవని చెప్పారు.