Minister Roja: 'ఏ మొహం పెట్టుకొని'.. వైఎస్ షర్మిలపై మంత్రి రోజా తీవ్ర వ్యాఖ్యలు
X
ఏపీలో ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరిక తర్వాత వైసీపీ నేతల్ని వరుసగా టార్గెట్ చేస్తుండటంతో అధికార పార్టీ కూడా అంతే ధీటుగా బదులిస్తోంది. ఇందులో ముఖ్యంగా సీఎం జగన్ రాజకీయ సోదరి మంత్రి ఆర్కే రోజాకు, సొంత చెల్లెలు వైఎస్ షర్మిలకు మధ్య కూడా మాటల యుద్ధం జరుగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం విశాఖ రైల్వే గ్రౌండ్లో ఆడుదాం - ఆంధ్ర ఫైనల్స్ ప్రారంభించిన మంత్రి రోజా... షర్మిలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. షర్మిల ఇప్పుడు ఏ పార్టీలో ఉందో అందరూ గమనించాలని కోరారు. జగన్ ను జైలు పాలు చేసిన పార్టీతో షర్మిల చేతులు కలపడం ఏంటని రోజా ప్రశ్నించారు. తద్వారా ఏపీకి అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో పర్యటనలు చేస్తూ జగన్ సర్కార్ పై షర్మిల చేస్తున్న విమర్శల్ని రోజా తప్పుబట్టారు.
తెలంగాణలో పోరాటం చేస్తానంటూ పెట్టిన వైఎస్సార్టీపీని ఎందుకు కాంగ్రెస్ లో విలీనం చేశారో వైఎస్ షర్మిల చెప్పాలని రోజా డిమాండ్ చేశారు. ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారో ఆమె చెప్పాలన్నారు. . వైఎస్ రాజశేఖర్ రెడ్డి బతికి ఉంటే కాంగ్రెస్ మీద ఉమ్మేసే వాళ్ళని చెప్పి.. ఇప్పుడు ఏ మొహం పెట్టుకొని కాంగ్రెస్లో మళ్ళీ జాయిన్ అయ్యారో షర్మిల చెప్పాలని మంత్రి రోజా డిమాండ్ చేశారు. ఏపీలో ఏ లబ్ది పొందడానికి కాంగ్రెస్ తరపున ప్రచారం చేస్తున్నారో ఆమె తెలపాలని డిమాండ్ చేశారు. ‘‘షర్మిలకు సలహా ఇస్తున్నాను... తెలంగాణాలో మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది కదా.. రేవంత్ రెడ్డి సర్కార్ నుంచి మనకి రావాల్సిన రూ. 6 వేల కోట్లు తీసుకురండి’’ అని సూచించారు. అలాగే ఉమ్మడి ఏపీ నుంచి రావాల్సిన లక్షా 80 వేల కోట్ల ఆస్తులు కూడా రాబట్టాలని కోరారు.
ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో మాదిరిగానే టీడీపీతో పాటు ఆ పార్టీతో కలిసి వచ్చే పార్టీలతో ఏపీ ఓటర్లు ఆడుకుంటారని రోజా సెటైర్లు పేల్చారు. ఓడించి హైదరాబాద్ తరిమేస్తారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంలో సీఎం ఫోటోలపై విపక్షాలు చేస్తున్న విమర్శలకు తీవ్రస్థాయిలో బదులిచ్చారు రోజా. ప్రభుత్వ కార్యక్రమాల్లో సీఎం ఫొటో కాకుండా దిష్టిబొమ్మ చంద్రబాబు ఫొటో పెట్టాలా అంటూ సెటైర్లు వేశారు. అలాగే టీడీపీ ప్రభుత్వ హయాంలో చేసిన ప్రభుత్వ కార్యక్రమాలకు చిరంజీవి, పవన్ కల్యాణ్ ఫొటోలు పెట్టారా అంటూ ప్రశ్నించారు. జగన్ ఫోటోలు చూస్తుంటే టీడీపీ నేతలకు కడుపుమంటగా ఉందని వ్యాఖ్యానించారు.