Home > ఆంధ్రప్రదేశ్ > 'పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్?'.. లోకేశ్‌పై రోజా సెటైర్లు

'పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్?'.. లోకేశ్‌పై రోజా సెటైర్లు

పులకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్?.. లోకేశ్‌పై రోజా సెటైర్లు
X

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ పర్యాటక శాఖా మంత్రి రోజా తనదైన శైలిలో విమర్శలు చేశారు. స్కిల్ డెవెలప్‌మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రధాన నిందితుడు అని అందుకే ఆయన్ను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. చంద్రబాబుకు రెండు రోజులు సీఐడీ కస్టడీ అనుమతి, మరోవైపు లోకేశ్ ఢిల్లీ పర్యటనపై ఏపీ మంత్రి రోజా సెటైర్లు విసిరారు. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున సీఎం జగన్ కి బెయిలొచ్చిందని గుర్తు చేస్తూ.. నారా లోకేష్ వెటకారంటగా శనివారం ఓ ట్వీట్ వేశారు. "బెయిల్ డే పదో వార్షికోత్సవ శుభాకాంక్షలు జైలు మోహన్" అంటూ ఘాటు ట్వీట్ పెట్టారు. దీనికి మంత్రి రోజా అంతే ఘాటుగా బదులిచ్చారు. దేశంలోనే అవినీతి అనకొండ చంద్రబాబు అని, ఆయనకు తొలి కస్టడీ డే శుభాకాంక్షలు అంటూ కౌంటర్ ఇచ్చారు.

ట్విట్టర్‌లో.. ‘పచ్చ మీడియాను అడ్డం పెట్టుకొని మీరెన్ని తప్పులు చేసినా ప్రజలకు కనబడవు అనే రోజులు పోయాయి లోకేష్.. మీ నాన్న చేసిన ప్రతి స్కాంను కూడా ఆధారాలతో సహా ప్రజల ముందు, న్యాయస్థానం ముందు ఉంచాం. చట్ట ప్రకారం చంద్రబాబు నాయుడు వాటిని ఎదుర్కొంటున్నారు. కుంభకోణాల్లో భాగస్వామ్యం ఉన్న ప్రతి ఒక్కరూ చట్టానికి తలవంచాల్సిందే.. జైలుకు వెళ్లాల్సిందే’ అంటూ పోస్ట్ చేశారు.

‘దేశంలోనే అవినీతి అనకొండ అయిన చంద్రబాబుకు తొలి కస్టడీ డే శుభాకాంక్షలు. ఖైదీ నెంబర్ 7691 కడుపున పుట్టిన నారా లోకేశ్ నీ లొకేషన్ ఎక్కడ? తండ్రి అడ్డంగా తినేసి జైలుకు వెళితే, మా నాన్న ఎలా పోయినా పర్లేదు నేను మాత్రం అరెస్ట్ కాకూడదని పారిపోయిన లోకేశ్ ఆంధ్రాకు ఎప్పుడొస్తావ్? అని మంత్రి రోజా ప్రశ్నించారు. ‘తల్లి, భార్య మీద మీ నాన్న భారం వదిలేసి పలాయనం చిత్తగించిన పులకేశ్ నీ జాడ ఎక్కడ? మీ నాన్న అవినీతిపై బహిరంగ చర్చకు రమ్మన్నావ్. నువ్వేమో రాష్ట్రం వదిలి పారిపోయావ్, మీ మామ బాలయ్య అసెంబ్లీ వదిలి పారిపోయాడు. చంద్రబాబు గజదొంగ అని అసెంబ్లీ సాక్షిగా నిరూపించడానికి మేం సిద్ధం. కాదని నిరూపించే ధైర్యం ఉందా? ధైర్యం ఉంటే అసెంబ్లీకి మీలో ఎవరు వస్తారో రండి. ఇది మా వైసీపీ సవాల్’ అంటూ రోజా ఎక్స్ లో ఘాటు విమర్శలు చేశారు.




Updated : 24 Sept 2023 10:55 AM IST
Tags:    
Next Story
Share it
Top