Home > ఆంధ్రప్రదేశ్ > YS Sharmila: జగనన్న పాలనలో వైఎస్ఆర్ మార్క్ లేదు.. వైఎస్ షర్మిల

YS Sharmila: జగనన్న పాలనలో వైఎస్ఆర్ మార్క్ లేదు.. వైఎస్ షర్మిల

YS Sharmila: జగనన్న పాలనలో వైఎస్ఆర్ మార్క్ లేదు.. వైఎస్ షర్మిల
X

నా అనుకున్న వాళ్ల కోసం ఎందాకైనా వెళ్లడం, ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండటం నాటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మార్క్ రాజకీయమని... కానీ ఇప్పటి పాలకులు పెద్ద పెద్ద కోటలు కట్టుకుని ప్రజలకు దూరంగా ఉంటున్నారని విమర్శించారు ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల. సోమవారం కడప జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశంలో వైఎస్‌ షర్మిల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సంక్షేమ పథకాలతో ముఖ్యమంత్రి అంటే ఇలా పని చేయాలని నిరూపించిన వ్యక్తి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ పథకాలు పొందని గడపే లేదని , పార్టీలకు అతీతంగా అందరూ ఆయన పథకాలు పొందారన్నారు.

రైతులకు రుణమాఫీ , 50 లక్షల మంది బిడ్డలకు ఫీజు రీయింబర్స్మెంట్ , 46 లక్షల పేదలకు పక్కా ఇళ్లు కట్టడం ఇలాంటివన్నీ వైఎస్సార్ మార్క్ సంక్షేమ పథకాలు అని తెలిపారు. వైఎస్‌ బతికే ఉంటే కడప స్టీల్‌ వచ్చేదన్నారు. అదే పూర్తై ఉంటే కచ్చితంగా 20 వేల మందికి ఉద్యోగాలు వచ్చేవి అన్నారు. లక్ష మందికి పరోక్షంగా ఉపాధి దొరికేది అని అభిప్రాయపడ్డారు. నేటి పాలకుల కారణంగా కడప స్టీల్ ఒక కల గానే మిగిలిపోయిందని విమర్శించారు షర్మిల. కాంగ్రెస్ పార్టీ కడప స్టీల్ ప్రాజెక్ట్ ను విభజన హామీల్లో పెట్టిందని గుర్తు చేశారు. చంద్రబాబు 18 వేల కోట్లతో మళ్ళీ శంకుస్థాపన చేశారని... 5 ఏళ్లలో నిర్లక్ష్యం చేశారన్నారు. ఆ టైంలో జగన్ దీక్షలు కూడా చేశారని తెలిపారు. ముఖ్యమంత్రి అయ్యాక రెండు సార్లు శంకుస్థాపన చేశారని వివరించారు. కడప స్టీల్ ను శంకుస్థాపన ప్రాజెక్ట్ గా మార్చారని ఎద్దేవా చేశారు.

రాజశేఖర్‌ రెడ్డి మార్క్‌ రాజకీయం, సంక్షేమ పాలన ఇప్పుడు జగనన్న పాలనలో లేదని షర్మిల వ్యాఖ్యానించారు. కడప తన పుట్టినిల్లు అని చెప్పిన షర్మిల.. జగన్ ఎలా పుట్టారో తను కూడా అలానే జమ్మల మడుగు ఆసుపత్రిలో పుట్టానన్నారు. జగన్‌కు తాను వ్యతిరేకి కాదని, ఇద్దరిదీ ఒకటే రక్తం అన్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మారిపోయారని ఆరోపించారు. ఇప్పుడున్న జగన్‌ను ఎప్పుడు చూడలేదన్నారు. ఆయనకు క్యాడర్‌కి, పార్టీకి తాను చేసిన సేవలు గుర్తు లేవన్నారు. నాడు వైసీపీని అధికారంలోకి తేవడాని 3,200 కి.మీ పాదయాత్ర చేస్తే.. ఈనాడు రోజుకొకరితో వ్యక్తిగత దూషణలు చేయిస్తున్నారని విమర్శించారు. తనపైనే స్టోరీలు అల్లుతున్నారని ఆవేదన చెందారు. రోజుకో జోకర్‌ను తీసుకొచ్చి బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. కొత్తగా వచ్చిన జోకర్ ప్రణబ్ ముఖర్జీ పేరు ప్రస్తావించారని తన భర్త వెళ్లి అనిల్‌ను కలిసినట్టు విమర్శలు చేస్తున్నారని అన్నారు షర్మిల. జగన్‌ను జైల్లో పెట్టి నన్ను సీఎం చేయమని నా భర్త కోరినట్లు సాక్షిలో విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్షి పత్రికలో జగన్‌కు ఎంత భాగస్వామ్యం ఉందో తనకూ అంతే వాటా ఉందని, వైసీపీ ఏం చేసినా భయపడే ప్రసక్తే లేదన్నారు.




Updated : 29 Jan 2024 2:48 PM IST
Tags:    
Next Story
Share it
Top