మా కుటుంబాన్ని నిలువునా చీల్చాడు.. షర్మిల సంచలన వ్యాఖ్యలు
X
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల ఫైర్ అయ్యారు. రాష్ట్రాన్ని, తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ చీల్చిందంటూ ఆయన చేసిన కామెంట్లకు కౌంటర్ ఇచ్చారు. ఏపీ అభివృద్ధి చెందకుండా, దయనీయ స్థితిలో ఉండేందుకు కారణం సీఎం జగన్ అని మండిపడ్డారు. జిల్లాల పర్యటనలో భాగంగా కాకినాడలో పార్టీ నేతలు,కార్యకర్తలతో సమావేశమైన షర్మిల ఈ వ్యాఖ్యలు చేశారు.
వైఎస్ కుటుంబంలో చీలికకు కారణం జగనన్న అని షర్మిల అన్నారు. ఆయన చేజేతులా కుటుంబాన్ని చీల్చారని అందుకు సాక్ష్యం దేవుడు, తన తల్లి విజయమ్మ అని అన్నారు. వైసీపీ ఇబ్బందుల్లో ఉంటే 18 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారని, వారిని మంత్రులను చేస్తానని మాట ఇచ్చిన జగన్ మోసం చేశారని షర్మిల మండిపడ్డారు. పార్టీ కోసం 3,200 కి.మీ పాదయాత్ర చేశానని గుర్తు చేశారు. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేపట్టానని, సమైక్యాంధ్ర కోసం పాదయాత్ర కొనసాగించానని చెప్పారు. స్వలాభం చూసుకోకుండా ఎప్పుడు అవసరమైతే అప్పుడు జగనన్న గెలుపు కోసం అండగా నిలబడి ప్రచారం చేశానని షర్మిల గుర్తుచేశారు.
తనకు వ్యక్తిగతంగా అన్యాయం చేసినా జగన్ మంచి ముఖ్యమంత్రి, వైఎస్ పేరు, ఆశయాలను నిలబెడితే చాలు అనుకున్నానని షర్మిల అన్నారు. కానీ ఐదేండ్లలో ముఖ్యమంత్రి సహా అందరూ బీజేపీకి బానిసలుగా మారారనని విమర్శించారు. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా రాష్ట్రంలో బీజేపీ రాజ్యమేలుతోందని, జగన్ తన పార్టీనీ, రాష్ట్రాన్ని బీజేపీ దగ్గర తాకట్టు పెట్టారని మండిపడ్డారు. అందుకే గత ఐదేండ్లలో ఒక్కసారి కూడా రాష్ట్రానికి ప్రత్యేక హోదా అడగలేదని సీఎం జగన్‌పై షర్మిల ఫైర్ అయ్యారు.