Home > ఆంధ్రప్రదేశ్ > 'పుష్ప' సీన్ రిపీట్.. స్మగ్లర్లకు షాకిచ్చిన పోలీసులు

'పుష్ప' సీన్ రిపీట్.. స్మగ్లర్లకు షాకిచ్చిన పోలీసులు

పుష్ప సీన్ రిపీట్.. స్మగ్లర్లకు షాకిచ్చిన పోలీసులు
X

పోలీసులు, ఫారెస్ట్‌ అధికారుల కళ్లుగప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్‌ చేయాలో ‘పుష్ప’ సినిమాలో కళ్లకు కట్టినట్లు చూపించారు. ఆ సినిమా స్ఫూర్తితో కేటుగాళ్లు రెచ్చిపోతూ స్మగ్లింగ్‌ను కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. తాజాగా అలాంటిదో మరో ఘటన చోటుచేసుకుంది. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో తమ కళ్లుగప్పి తప్పించుకోవాలని ప్రయత్నించిన స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. గంజాయిని తరలిస్తున్న వ్యాన్‌ని రాత్రివేళ ఛేజింగ్ చేసి మరీ పట్టుకున్నారు.





వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రా-ఒడిశా స‌రిహ‌ద్దుల్లోని చిత్రకొండ పోలీసులు రాత్రివేళ పెట్రోలింగ్ నిర్వహిస్తుండ‌గా ఒక బొలెరో(ఏపీ 07 టి కే 0466) వాహనం వేగంగా రావడాన్ని గమనించారు. ఆ వాహనాన్ని ఆప‌డానికి ప్రయత్నించగా వారు తప్పించుకుని పారిపోయారు. దీంతో పోలీసులు ఆ వాహనాన్ని చేజింగ్ చేస్తూ వీడియో తీశారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి స్మగ్లర్లు వ్యాన్‌లో ఉన్న గంజాయి మూటలను రోడ్డుకు అడ్డంగా వేసుకుంటూ వెళ్లారు. అయితే పోలీసులు ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా వారిని వెంబడిస్తూనే ఉన్నారు.





పోలీసులకు దొరికితే తమ తాట తీస్తారని భయపడిన స్మగ్లర్లు చివరికి వాహనాన్ని వదిలేసి పరారయ్యారు. దీంతో పోలీసులు అందులోని 980 కేజీల గంజాయిని స్వాధీన చేసుకుని స్టేషన్‌కు తరలించారు. దీని విలువ మార్కెట్లో సుమారు కోటి రూపాయలు ఉంటుందని ఫోలీసులు అంచనా వేస్తున్నారు.. ఒడిశాలో దీన్ని కొనుగోలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు తరలిస్తున్న విచారణలో తేలిందని.. ఈ స్మగ్లింగ్‌లో పాత్రధారులపై దర్యాప్తు చేస్తున్నామని ఒడిశాలోని చిత్రకొండ పోలీసులు తెలిపారు. గంజాయి స్మగ్లర్లను పోలీసులు తరిమిన దృశ్యాలు.. ‘పుష్ప’ చిత్రంలో ఎర్రచందనం తరలిస్తుండగా అల్లు అర్జున్‌ను పోలీసులు వెంబడించిన దృశ్యాన్ని తలపించేలా ఉంది.




Updated : 20 Sept 2023 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top