Home > ఆంధ్రప్రదేశ్ > పైసా లాభపడ్డట్లు నిరూపించినా పీక కోసుకుంటా - అచ్చెన్నాయుడు

పైసా లాభపడ్డట్లు నిరూపించినా పీక కోసుకుంటా - అచ్చెన్నాయుడు

పైసా లాభపడ్డట్లు నిరూపించినా పీక కోసుకుంటా - అచ్చెన్నాయుడు
X

ఏపీలో రాజకీయ కక్ష తప్ప చట్టం, ధర్మం లేవని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నాడు. సీఎం జగన్ పిచ్చి నిన్నటితో పరాకాష్ఠకు చేరిందని అన్నారు. ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమవుతుండటంతో చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి దృష్టి మళ్లించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో చంద్రబాబుకుగానీ తనకుగానీ పైసా లబ్ది చేకూరినట్లు నిరూపించినా పీక కోసుకుంటానని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు. ఎవరెన్ని కేసులు పెట్టినా భయపడనని తేల్చిచెప్పారు.

విచారణ పేరుతో చంద్రబాబును రెండ్రోజులుగా నిద్రలేకుండా చేసి ఇబ్బందులు పెట్టారని అచ్చెన్నాయుడు విమర్శించారు. సీఐడీ చీఫ్ ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన విషయాలనే రిమాండ్ రిపోర్టులో పొందుపరిచారని అన్నారు. రిమాండ్ రిపోర్టు అంతా ఓ కట్టు కథన్న ఆయన.. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మొదట్లో తన దగ్గరలేదని, కేబినెట్ చివరలో ఆ శాఖ తన పరిధిలోకి వచ్చిందని అన్నారు. రెండేళ్ల క్రితం నమోదైన ఎఫ్ఐఆర్ లో తన పేరుగానీ, చంద్రబాబు పేరుగానీ లేవన్న ఆయన.. ఇప్పుడు దురుద్దేశంతోనే తమ పేర్లు చేర్చారని ఆరోపించారు.

చంద్రబాబు అరెస్ట్ ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని అచ్చెన్నాయుడు అభిప్రాయపడ్డారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వల్ల ఎంతో మంది శిక్షణ పొందారని సీఐడీనే చెప్పిందన్న ఆయన.. కేసులన్నీ ఊహాజనితమైనవేనని అన్నారు. సీఎం జగన్ పెట్టే తప్పుడు కేసులను కోర్టులోనే ఎదుర్కొంటామని స్పష్టం చేశారు. ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నేతలపై కేసులు పెడితే వారంతా ఏమవుతారో ఊహించుకోండని అచ్చెన్నాయుడు వార్నింగ్ ఇచ్చారు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో ప్రేమ్ చంద్రారెడ్డి, అజయ్ కల్లం పేర్లు ఎందుకు చేర్చలేదని ప్రశ్నించారు. జగన్ చెప్పినట్లు నాటకాలు ఆడుతున్న అధికారులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.

Updated : 10 Sep 2023 7:19 AM GMT
Tags:    
Next Story
Share it
Top