పవన్ కల్యాణ్ కు ఏపీ మహిళా కమిషన్ నోటీస్
X
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ కు ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. ఏలూరు సభలో ఆయన చేసిన వ్యాఖ్యలకు పదిరోజుల్లో వివరణ ఇవ్వాలని కోరింది.
ఏపీలో మహిళలు కనిపించకుండా పోతున్నారని పవన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. దీని మీద తాజాగా మహిళా కమిషన్ కూడా ఆయనకు నోటీసులు పంపింది. పదిరోజుల్లోగా ఈ వ్యాఖ్యల మీద వివరణ ఇవ్వాలని...లేదంటే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. పవన్ అన్నట్టుగా తప్పిపోయిన మహిళల వివరాలను ఇవ్వాలని కోరారు. ఆయనకు ఈ వివరాలను తెలిపిన కేంద్ర అధికారి ఎవరో చెప్పాలని కమిషన్ ఆదేశించింది.
ఒంటరి మహిళల్ని అవమానపరిచేలా పవన్ మాట్లాడారని....ఆయన వివరణ ఇచ్చేవరకు ఊరుకునేది లేదని కమిషన్ స్పష్ట చేసింది. పవన్ వ్యాఖ్యలపై భారీగా ఫిర్యాదులు వస్తున్నాయని... ఈ మెయిల్స్ ద్వారా ఆయన మీద మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని కమిషన్ అధికారులు చెబుతున్నారు. వాలంటీర్స్ మీద పవన్ కళ్యాణ్ విషం కక్కుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలకు వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. కలెక్టరేట్ల దగ్గర ధర్నాలు, ఆందోళను నిర్వహిస్తున్నారు. పవన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.