నారా లోకేష్‌పై డీజీపీకి ఫిర్యాదు చేసిన పోసాని కృష్ణ మురళి
X
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌పై ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు ఏపీఎఫ్‌డీసీ చైర్మెన్ పోసాని కృష్ణ మురళి. తనను హత్య చేసేందుకు లోకేష్ కుట్ర చేశారని ఆయన బుధవారం డీజీపీకి ఫిర్యాదు చేశారు. డీజీపీకి ఫిర్యాదు చేసిన అనంతరం... మంగళగిరిలో మీడియాతో మాట్లాడుతూ.. తనను హత్య చేసేందుకు కుట్ర జరుగుతుందని , తనకు భద్రత కల్పిస్తానని డీజీపీ హామీ ఇచ్చారన్నారు. డీజీపీ దృష్టికి అన్ని విషయాలను తీసుకెళ్లినట్టుగా పోసాని తెలిపారు..
లోకేష్ కారణంగా తనకు ఉన్న ప్రమాదం గురించి డీజీపీకి వివరించానన్నారు. టీడీపీలో చేరాలని లోకేష్ తనను కోరాడన్నారు. అయితే తాను టీడీపీలో చేరేందుకు అంగీకరించలేదన్నారు. అందుకే లోకేష్ ఇగో హర్ట్ అయిందని, తనపై కక్ష పెంచుకున్నాడని పోసాని కృష్ణ మురళి చెప్పారు. ఎవరైనా ఆధారాలు చూపి హత్యలు చేస్తారా అని మీడియా ప్రతినిధులను పోసాని కృష్ణ మురళి ప్రశ్నించారు.
‘నాకు ముఖ్యమంత్రి పదవి వద్దు, ప్రజలే ముఖ్యమని కాంగ్రెస్‌లో ఉన్నపుడు చంద్రబాబు చెప్పారు. కానీ కాంగ్రెస్ ఒడిపోగానే టీడీపీలో చేరి చంద్రబాబు ఎన్టీఆర్ పక్కన చేరారు. తరువాత ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచారు. చంద్రబాబుకు పదవి ఇష్టం లేకపోతే పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రి చేస్తానని ప్రమాణం చేయాలి. లోకేష్ నాపై హత్యాయత్నం చేసే అవకాశం ఉంది. ఎన్టీ రామారావుకు చెప్పే వెన్నుపోటు పొడిచారా?. నేను అగ్రెసివ్‌గా మాట్లాడతా కాబట్టి నన్ను చంపాలనుకుంటున్నారు. లోకేష్ బండారం మొత్తం బయట పెట్టింది నేనే. లోకేష్ అందరినీ బట్టలు విప్పి కొడతా అంటున్నారు. ఎన్నిసార్లు, ఎంతమంది బట్టలూడ దీస్తావ్? ప్రజలకు ఏం చేస్తావో చెప్పు’ అని పోసాని లోకేష్‌పై మండిపడ్డారు.