Chandrababu: చంద్రబాబు కేసులో ముగిసిన వాదనలు.. ఆ రోజే తీర్పు..
X
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో టీడీపీ చీఫ్ చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో వాదనలు ముగిశాయి. చంద్రబాబు తరఫున ప్రమోద్‌కుమార్ దూబే.. సీఐడీ తరఫున అదనపు ఏజీ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్ చేసింది. సోమవారం తీర్పు వెల్లడిస్తామని స్పష్టం చేసింది.
గత మూడు రోజులుగా ఈ రెండు పిటిషన్లపై సుదీర్ఘ వాదనలు జరిగాయి. చంద్రబాబు తరపు న్యాయవాది ప్రమోద్‌కుమార్ దూబే వాదిస్తూ.. చంద్రబాబుకు స్కిల్ స్కాంకు అసలు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. రాజకీయ ప్రయోజనాల కోసమే.. రెండేళ్ల తర్వాత ఈ కేసును బయటకు తీసి బాబును ఇరికించారని అన్నారు. బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. అయితే బాబుకు బెయిల్ ఇవ్వొద్దని సీఐడీ కస్టడీకి ఇవ్వాలని అదనపు ఏజీ పొన్నవోలు వాదించారు.
పలు షెల్ కంపెనీల నుంచి టీడీపీ అకౌంట్లోకి 27కోట్లు వచ్చాయని పొన్నవాలు ఆరోపించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కోర్టుకు అందజేశారు. ఈ నెల 10న ఆడిటర్ను సీఐడీ విచారించనుందని అన్నారు. ఈ కేసులో బాబుకు బెయిల్ ఇవ్వొద్దని.. స్కిల్ స్కామ్ కర్త, కర్మ, క్రియ అంతా ఆయనేనని పొన్నవోలు వాదించారు. బాబును సీఐడీ కస్టడీకి ఇస్తే మిగితా వివరాలు రాబట్టేందుకు వీలుంటుందని కోర్టును కోరారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.