'అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే'.. ఫ్లెక్సీల కలకలం
X
ఆంధ్రప్రదేశ్ లోని ఒంగోలులో జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కలకలం సృష్టిస్తున్నాయి. కాబోయే సీఎం జూనియర్ అంటూ ఫ్లెక్సీలు వెలిశాయి. ఈ రోజు ప్రకాశం జిల్లాలో నారా లోకేష్ యువగళం పర్యటన ఉంది. ఈ సమయంలో వెలిసిన ఫ్లెక్సీలు చర్చనీయాంశంగా మారాయి. ఫ్లెక్సీల్లో.. ‘నెక్ట్స్ సీఎం జూనియర్ ఎన్టీఆర్..అసలోడు వచ్చేవరకు కొసరోడికి పండగే..’ అని రాసి ఉంది.
జూనియర్ ఎన్టీఆర్ను హైలెట్ చేస్తూ .. ‘‘అసలోడు వచ్చేవరకూ కొసరోడికి పండగే’’ అంటూ మెయిన్ రోడ్ సర్కిల్స్ వద్ద గుర్తు తెలియని వ్యక్తులు ఈ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకవేళ.. భవిష్యత్తులో ఎప్పుడైనా టీడీపీ అధికారంలోకి వస్తే ఎన్టీఆరే సీఎం అవుతాడంటూ అందులో రాసి ఉంచారు. ఒంగోలు లోని అద్దంకి బస్టాండ్ సమీపంలో.. ఫ్లై ఓవర్ కింద.. మరి ఒకటిరెండు చోట్ల పెట్టారు. పలు కామెంట్స్ తో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి.ఫ్లెక్సీలు పెట్టింది జూనియర్ ఎన్టీఆర్ అభిమానుల పనే అనుకుంటున్నారు. ఈ ఫ్లెక్సీలతో ఉద్రిక్తతలు చోటు చేసుకోకుండా.. పోలీసులు వాటిని తొలగిస్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఫ్లెక్సీ లో తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఎన్టీఆర్(స్వర్గీయ) ఫొటోతో పాటు .. లోకేష్ తండ్రి, టీడీపీ అధినేత చంద్రబాబు ఫోటో కూడా ఉండడం గమనార్హం.