Ayodhya Ram Mandir : అయోధ్య రామమందిరం: టీటీడీ సాయం కోరిన శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్
X
దేశం నలుమూలల నుంచి వస్తున్న భక్తులతో అయోధ్య రామమందిరం భక్తజనసంద్రంగా మారుతోంది. వారాంతపు రోజుల్లో భక్తుల రద్దీ రెట్టింపు అవుతోంది. ప్రతీ రోజూ వేల మంది భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకుంటున్నారు. ఆలయ ప్రాంగణాలన్నీ కిటకిటలాడుతున్నాయి. అయోధ్య ఆలయానికి వచ్చే భక్తులను నియంత్రించడం ఇప్పడొక కొత్త సమస్యగా మారింది. ఉన్న పరిమిత సమయంలోనే వేలాదిమందికి రాములవారి దర్శనభాగ్యాన్ని కల్పించడం.. శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులకు సవాల్‌గా మారింది. రద్దీ నియంత్రణపై అనుభవం లేకపోవడంతో.. వారు టీటీడీ సహాయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలో- అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం మేరకు టీటీడీ కార్యనిర్వాహణాధికారి ఏవీ ధర్మారెడ్డి, అధికారుల బృందం శనివారం సాయంత్రం అయోధ్యకు వెళ్లారు.
అయోధ్య ట్రస్ట్ ప్రతినిధులైన డాక్టర్ అనిల్ మిశ్రా, గోపాల్ జి, జగదీష్ ఆఫ్లే, గిరీష్ సహస్ర భోజనిలతో వారు సమావేశమయ్యారు. బాలరాముడి ఆలయానికి వచ్చే భక్తుల రద్దీ క్రమబద్ధీకరణ, దర్శనం ఏర్పాట్లు, సౌకర్యాల కల్పన, క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ముఖ్యంగా ఆలయానికి వచ్చే భక్తులకు సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు ఎలాంటి ఏర్పాట్లు చేపట్టాలనే విషయాలను టీటీడీ ఈవోను అడిగి తెలుసుకున్నారు. క్యూలైన్ల నిర్వహణకు సంబంధించి టీటీడీ ఇంజినీరింగ్ అధికారులు పలు సూచనలు చేశారు. అనంతరం టీటీడీ అధికారులకు స్వామివారి దర్శనం కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. మరోరెండు రోజుల పాటు టీటీడీ అధికారుల బృందం అయోధ్యలోనే ఉండనుంది.