రాజమహేంద్రవరం రోడ్డు కం రైల్వే బ్రిడ్జ్‌పై ఈ వాహనాలకు నో ఎంట్రీ
X
రాజమహేంద్రవరం, ఈ పేరు వినగానే మొదటగా గుర్తుకు వచ్చేది గోదావరి ఆ తరువాత రాజమహేంద్రవరం–కొవ్వూరును అనుసంధానిస్తూ ఉన్న రోడ్ కం రైలు బ్రిడ్జ్. గోదావరి నదిపై నిర్మించిన ఈ అత్యంత భారీ వంతెనకు ఎంతో చారిత్రాత్మక గుర్తింపు ఉంది. వంతెన మీదుగా వాహనాలు, కింద కూతపెట్టుకుంటూ వెళ్లే రైళ్లతో ఎంతో చక్కగా ఒంపులు తిరిగి ఉండే ఈ బ్రిడ్జి గోదావరి జిల్లాలకు ఓ మణిహారం. దాదాపు రెండున్నర కిలోమీటర్లు ఉన్న ఈ బహుల ప్రయోజనాలు కలిగిన వంతెనపై నిత్యం లక్షల్లో వాహనాల రాకపోకలు కొనసాగుతుంటాయి. అయితే ఈ మధ్యకాలంలో వంతెనపై ట్రాఫిక్ విపరీతంగా పెరిగిపోయింది. భారీ వాహనాలు సైతం ఈ బ్రిడ్జిపైనే రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఇదే వంతెనకు శాపంగా మారింది. చారిత్రక వంతెన తరచుగా దెబ్బతింటోంది. ఎన్నిసార్లు మరమ్మత్తులు చేసినా రిపేర్లు చేయడం అనివార్యంగా మారుతోంది. దీంతో ఎప్పుడేం జరుగుతుందో అన్న అయోమయం నెలకొంది ఈ క్రమంలో తాజాగా జిల్లా కలెక్టర్ కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నారు. రోడ్ కం రైలు బ్రిడ్జ్‌పై భారీ వాహనాల రాకపోకలను నిలిపివేస్తూ కలెక్టర్ మాధవీలత ఆదివారం ఆదేశాలు జారీ చేశారు.
1974 నుంచి రోడ్ కం రైలు బ్రిడ్జ్ పైన అన్ని రకాల వాహనాల రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రిడ్జి లైఫ్ టైం 65 ఏళ్లని అప్పట్లోనే నిర్ణయించారు. దీంతో ఈ వంతెన అందుబాటులోకి వచ్చి దాదాపు 49 సంవత్సరాలు పూర్తి అవుతోంది. ఇంకా జీవితకాలం ఉన్నప్పటికీ రోజు రోజుకూ వంతెనపై విపరీతమైన ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో బ్రిడ్జి డెక్ జాయింట్‌లు తరచుగా దెబ్బతింటున్నాయి. అందుకే వంతెన భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ ఆదేశాలతో ఆదివారం నుంచే బ్రిడ్జ్‌పై నుంచి భారీ వాహనాల రాకపోకలను నిలిపివేశారు అధికారులు. ఆర్టీసీ, ప్రైవేటు బస్సులు, లారీలు, లోడ్ వాహనాలన్నింటిని ప్రత్యామ్నాయ మార్గం వైపు మళ్లించారు. ప్రస్తుతం వంతెనపైన కేవలం టూ వీలర్స్, ఆటోలు, కార్ల రాకపోకలకు మాత్రమే అనుమతిస్తున్నారు. అయితే ఈ నిషేధం ఎప్పటివరకు కొనసాగుతుంది అనే విషయంపై ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు. అయితే ముందుగా ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకపోవడంతో బస్సులు, ఇతర వాహనాలు మళ్లించడంతో కాస్త గందరగోళం నెలకొంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.