పార్కుల ముందు, రోడ్లపై కాదు.. సొంతూళ్లకు వెళ్లి ధర్నాలు చేయండి.. బండ్ల గణేశ్
X
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టును ఖండిస్తూ.. హైదరాబాద్ లోని పలు ఐటీ కంపెనీల్లోని ఉద్యోగులు ధర్నాలు చేశారు. ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చి ఆందోళన చేయడంతో ట్రాఫిక్ సమస్య తలెత్తింది. ఇందుకు సంబంధించిన వీడియోలపై సోషల్ మీడియాలోని నెటిజన్లు భిన్నంగా స్పందించారు. అరెస్ట్ అయిన వ్యక్తి ఏపీలోనే ఉండగా... ఆయన ద్వారా లబ్ధిపొందామని చెప్పుకుంటున్న ఉద్యోగులు.. తెలంగాణలో ఆందోళన నిర్వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ ధర్నాలేవో అమరావతిలోనో.. లేదంటే ఏపీలోని ఆయా జిల్లాల్లో చేస్తే అక్కడి ప్రభుత్వం స్పందించే అవకాశముందని కౌంటర్లు కూడా వేశారు. తాజాగా ఈ విషయంపై సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కూడా స్పందించారు.
చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ ఐటీ ఉద్యోగులు పార్కుల ఎదుట, రోడ్లపై ఆందోళనలు చేయడం కాకుండా సొంత గ్రామాలకు వెళ్లాలని బండ్ల గణేష్ సూచించారు. అక్కడి బోడ్రాయి ఎదుట కూర్చొని ధర్నాలు చేయాలని అన్నారు. చీము నెత్తురు ఉంటే నెల రోజుల పాటు ఉద్యోగాలు మానేయాలని, సొంత ఊర్లకు వెళ్లి ఆందోళనలు చేయాలని పిలుపునిచ్చారు. చంపేస్తే.. చంపేయాలని చెప్పాలని సూచించారు. టీడీపీ అధినేత రాజమండ్రి జైలులో ఉన్నారని, దీంతో తనకు అన్నం కూడా తినాలని అనిపించడం లేదని బండ్ల గణేష్ అన్నారు. చంద్రబాబు నాయుడు జాతి సంపద అని తెలిపారు. ఆయనను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. చంద్రబాబు నాయుడు కచ్చితంగా వచ్చే ఎన్నికల్లో గెలుస్తారని, ముఖ్యమంత్రి అవుతారని బండ్ల గణేష్ ధీమా వ్యక్తం చేశారు.