చంద్రబాబు అరెస్ట్... పవన్ ఫ్లైట్కు నో పర్మిషన్
X
ఏపీలో చంద్రబాబు అరెస్ట్ ప్రకంపనలు రేపుతోంది. కాసేపట్లో బాబును సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అయితే చంద్రబాబును కలిసేందుకు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లడానికి సిద్ధమయ్యారు. దీన్నికోసం ఆయన బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి ప్రత్యేక ఫ్లైట్లో గన్నవరం వెళ్లాల్సివుంది. అయితే పవన్ విమానానికి అనుమతి ఇవ్వొద్దని ఎయిర్ పోర్టు అధికారులను పోలీసులు కోరారు. దీంతో పవన్ ఫ్లైట్ టేకాఫ్కు అధికారులు అనుమతి ఇవ్వలేదు.
అదే సమయంలో పవన్ కళ్యాణ్ను రిసీవ్ చేసుకునేందుకు గన్నవరం ఎయిర్ పోర్టుకు వచ్చిన జనసేన నేత నాదెండ్ల మనోహర్ను పోలీసులు అడ్డుకున్నారు. ఇక పోలీసుల తీరుపై జనసేన నాయకులు మండిపడుతున్నారు. కాగా కేవలం చంద్రబాబు కుటుంబానికి మాత్రమే ఆయన్ని కలిసే అవకాశం ఇస్తామని సీఐడీ అధికారులు స్పష్టం చేశారు. నారా భువనేశ్వరి, నారా లోకేష్ తప్ప ఇంకెవరికి అనుమతిలేదని స్పష్టం చేశారు.
కాసేపట్లో బాబును విజయవాడ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. బాబు తరుపున వాదించేందుకు ప్రముఖ అడ్వకేట్ను టీడీపీ రంగంలోకి దించింది. సుప్రీం సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ్ లూథ్రా బాబు తరుపున వాదించనున్నారు. చంద్రబాబుపై ఇతర కేసుల్లోనూ ఆయనే వాదనలు వినిపిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ ఆయన్ను ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా పిలిపిచ్చింది. ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీ నుంచి ఏపీకి వచ్చారు. ఇదిలా ఉండగా బాబుకు బెయిల్ లభిస్తుందా.. రిమాండ్‌కు వెళ్తారా లేక సీఐడీ కస్టడీకి తీసుకుంటుందా అనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.