27kg gold of Jayalalitha: 6 ట్రంక్ పెట్టెలు తెచ్చుకోండి.. ఈ బంగారాన్ని తీసుకెళ్లండి: బెంగుళూరు కోర్టు
X
తమిళనాడు దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారు ఆభరణాలన్నీ తమిళనాడు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని కర్ణాటక న్యాయస్థానం( బెంగళూరులోని 36వ సిటీ సివిల్ కోర్టు) ఆదేశించింది. వచ్చే నెల 6,7 తేదీల్లో ఈ బంగారాన్ని తమిళనాడు ప్రభుత్వం తీసుకెళ్లాలని ఆదేశాలు జారీ చేసింది. మొత్తం ఆరు ట్రంకు పెట్టలతో రావాలంటూ కోర్టు తమిళనాడు ప్రభుత్వానికి తెలిపింది. ఈ రెండు రోజుల్లో జయలలిత బంగారు ఆభరణాల అప్పగింత కేసు తప్పించి మరో కేసును విచారించకూడదని న్యాయస్థానం నిర్ణయించింది.
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత బంగారం కర్ణాటక ప్రభుత్వం అధీనంలో ఉంది. 1996లో చెన్నైలోని జయలలిత నివాసం నుంచి బంగారం, వెండి, వజ్రాభరణాలను స్వాధీనం చేసుకున్న వస్తువులన్నీ కర్ణాటక ప్రభుత్వ అధీనంలోనే ఉన్నాయి. దాదాపు ఏడు కిలోల బంగారు ఆభరణాలు, ఏడు వందల కిలోల వెండి వస్తువులు, 468 రకాల వజ్రాభరణాలు ఇందులో ఉన్నాయి. కర్ణాటక ప్రభుత్వ అధీనంలో జయలలితకు సంబంధించిన ఖరీదైన చెప్పులు, పట్టుచీరలు , ఇతర వస్తువులు, 1.93 లక్షల నగదు కూడా ఉంది. అయితే వీటన్నింటినీ తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించాలని కర్ణాటకలోని బెంగళూరు కోర్టు ఆదేశించింది.
'ఆ బంగారు ఆభరణాలు తీసుకోవడానికి ఒక అధికారిని నియమించాం. తమిళనాడు హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఐజీపీ ఆ అధికారితో సమన్వయం చేసుకోవాలి. ఫొటోగ్రాఫర్స్, వీడియోగ్రాఫర్స్, ఆరు పెద్ద ట్రంకు పెట్టెలు, అవసరమై భద్రత సిబ్బందితో వచ్చి బంగారు ఆభరణాలను తీసుకోవాలి. తమిళనాడు డిప్యూటీ ఎస్పీ ఈ విషయాన్ని హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ రోజుల్లో భద్రతకు స్థానిక పోలీసులను ఏర్పాటు చేసుకోనేలా చర్యలు తీసుకోవాలి' అని న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. దీంతో తమిళనాడు ప్రభుత్వానికి జయలలిత బంగారం, వెండి వస్తువులను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమయింది.
అక్రమ ఆస్తుల కేసులో జయలలితకు 2014లో బెంగళూరు కోర్టు నాలుగేళ్లు జైలు శిక్ష, రూ.100 కోట్లు జరిమానా విధించింది. అలాగే స్వాధీనం చేసుకున్న వస్తువులను ఆర్బీఐ, ఎస్బీఐ లేదా బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని స్పష్టం చేసింది. అయితే ఇంతలోనే జయలలిత మరణించారు. ఈ క్రమంలోనే దీనిపై మరోసారి విచారణ జరిపిన ప్రత్యేక కోర్టు ఆ ఆభరణాలను తమిళనాడు ప్రభుత్వానికి బదిలీ చేయాలని ఆదేశించింది.