లైంగిక వేధింపుల కేసులో విశాఖ పూర్ణానందకు బిగ్ షాక్
X
విశాఖలోని జ్ఞానానంద ఆశ్రమం ఆధ్యాత్మిక గురువు పూర్ణానంద స్వామీజీ మైనర్ బాలికపై రెండేళ్లుగా అత్యాచారం చేస్తున్న ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఈ సంఘటన జూన్ నెల చివర్లో వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు పూర్ణానంద స్వామీజీని అదుపులోకి తీసుకుని కోర్టు ముందు హాజరుపరిచారు. పోలీసుల రిమాండ్ రిపోర్టులోనూ ఎన్నో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. పూర్ణానంద స్వామీ చేసిన దారుణాలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకువచ్చారు. తాజాగా ఈ కేసు మరో కీలక మలుపు తిరిగింది. విశాఖ పొక్సో కోర్టులో పూర్ణానంద వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది.
జులై మొదటి వారంలో జరిగిన ఐడెంటిఫికేషన్ పరేడ్లో మైనర్ బాలికలు స్వామీజీని గుర్తుపట్టారు. దీంతో.. బెయిల్ పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు పోక్సో కోర్టు ప్రకటించింది.
రీసెంట్గా బెయిల్ కోసం పూర్ణానంద పోక్సో కోర్టును ఆశ్రయించారు. అయితే ఈ కేసులో ఆధారాలన్నీ పూర్ణానందకు వ్యతిరేకంగా ఉన్నాయని, బెయిల్ మంజూరు చేస్తే ప్రమాదకరమని పోక్సో స్పెషల్ పీపీ కరణం కృష్ణ కోర్టులో వాదించారు. బెయిల్ దొరికితే సాక్ష్యాలు తారుమారు చేసే అవకాశం ఉందని తెలిపారు. పీపీ వాదనతో ఏకీభవించిన పోక్సో కోర్టు పూర్ణానంద బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసింది.
చైల్డ్ వేల్ఫేర్ కమిటీ మెంబర్స్ వివరాల ప్రకారం.. పూర్ణానంద సరస్వతి స్వామీజీ ఆశ్రమంలో 14 మంది మైనర్ బాలికలతో పశువుల పాకలో పనులు చేయించేవారు. అక్కడితో ఆగకుండా వారిపై లైంగిక వేధింపులకు పాల్పడేవాడు. ఈ క్రమంలోనే అశ్రమంలో ఓ 13 ఏళ్ల మైనర్ బాలికను గొలుసులతో బంధించి లైంగికంగా వేధింపులకు గురిచేశాడు. స్నానానికి వెళ్లేందుకు గొలుసులు తీయడంతో ఆశ్రమంలోని ఓ మహిళ సహకారంతో బాలిక బయట పడింది. విజయవాడ దిశ పోలీసులను ఆశ్రయించి పూర్ణానంద ఆకృత్యాలను ఒక్కొక్కటిగా చెప్పడంతో స్వామీజీ నిజరూపం బయటపడింది.